Andhra Pradesh: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బదిలీ

AP High Court Justice Battu Devanand Transferred to Madras High Court
  • జస్టిస్ దేవానంద్‌ను బదిలీ చేస్తూ నాలుగు నెలల క్రితం సుప్రీం కొలీజయం సిఫార్సు
  • రాష్ట్రపతి ఆమోద ముద్రతో నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
  • తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున కూడా మద్రాస్ హైకోర్టుకే బదిలీ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బదిలీ అయ్యారు. ఆయనను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిస్ దేవానంద్ బదిలీకి ఆమోద ముద్ర వేశారు. అలాగే, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున కూడా మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 

జస్టిస్ దేవానంద్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజయం గతేడాది నవంబరులో కేంద్రానికి సిఫారసు చేసింది. నాలుగు నెలల తర్వాత ఇప్పుడు కేంద్రం వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అప్పట్లో ఈ సిఫారసులపై హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి ర్యాలీలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే బదిలీలు జరిగాయని ఆరోపించారు. అంతేకాకుండా, బదిలీలను పునఃసమీక్షించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అప్పటి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌లను కలిసి విజ్ఞప్తి చేశారు. బదిలీల విషయంలో మరోమారు ఆలోచించాలని ఏపీ బార్ కౌన్సిల్ కూడా కోరింది. అయినప్పటికీ నాలుగు నెలల తర్వాత బదిలీ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. కాగా, జస్టిస్ దేవానంద్ 13 జనవరి 2020న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
Andhra Pradesh
AP High Court
TS High Court
Justice Battu Devanand
Justice D. Nagarjuna

More Telugu News