Hindenburg Research: మరో బాంబ్ పేల్చనున్న హిండెన్ బర్గ్.. ఈ సారి ఎవరి వంతో?

  • ‘బిగ్ వన్’పై త్వరలో హిండెన్ బర్గ్ రిపోర్ట్ 
  • ట్విట్టర్ లో ప్రకటించిన అమెరికన్ సంస్థ
  • ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా నివేదిక
  • దీని ఫలితంగా 50 శాతానికి పైగా పడిపోయిన అదానీ షేర్లు
After Adani bomb Hindenburg Research teases another big report

హిండెన్ బర్గ్ అనే అమెరికన్ సంస్థ గురించి భారత ఇన్వెస్టర్లకు ఇప్పుడు ప్రత్యేక పరిచయం చేయక్కర్లేదు. ఒక్క నివేదికతో అదానీ గ్రూప్ విలువకు 50 శాతం తూట్లు పొడిచిన సంస్థ ఇది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు ఉన్నాయని, విదేశాల్లోని షెల్ కంపెనీల ద్వారా షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుంటున్నట్టు ఈ సంస్థ ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదిక అదానీ గ్రూపు షేర్లను కుదిపేసింది. ఏకంగా సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించే వరకు వెళ్లింది.


ఇదిలావుంచితే, త్వరలోనే మరో పెద్ద సంస్థపై తాము నివేదికను విడుదల చేయబోతున్నట్టు హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా ప్రకటించింది. దీంతో హిండెన్ బర్గ్ తదుపరి లక్ష్యం ఎవరై ఉంటారు? అన్న సందేహం ఇన్వెస్టర్లలో ఏర్పడింది. ‘‘త్వరలోనే కొత్త నివేదిక - మరో బిగ్ వన్ పై’’ అంటూ హిండెన్ బర్గ్ సంస్థ ట్విట్టర్లో ప్రకటించింది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం మొదలు కావడంతో, దీనికి సంబంధించి హిండెన్ బర్గ్ నివేదిక విడుదల చేయవచ్చని కొందరు భావిస్తున్నారు. అలా కాకుండా మరో భారతీయ సంస్థను హిండెన్ బర్గ్ లక్ష్యం చేసుకుంటుందా? అన్నదే ఇప్పుడు చాలామందిలో నెలకొన్న సందేహం. 

హిండెన్ బర్గ్ అనే సంస్థను నేట్ ఆండర్సన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థ ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ లో ప్రావీణ్యం ఉన్నట్టు చెప్పుకుంటోంది. అంతర్జాతీయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల పుస్తకాలను ఈ సంస్థ తనదైన నైపుణ్యంతో జల్లెడ పడుతుంది. లోపాలు ఉన్నాయని నిర్ధారణ అయితే పూర్తి నివేదికను సిద్ధం చేస్తుంది. తదుపరి ఆయా గ్రూప్ లేదా కంపెనీల్లో షార్ట్ పొజిషన్లను బిలియన్ డాలర్ల విలువ మేర తీసుకుంటుంది. అనంతరం నివేదికను బయటపెడుతుంది. దాంతో ఆయా షేర్లు పడిపోతాయి. ముందే అమ్మేసినందున వాటిపై హిండెన్ బర్గ్ సంస్థకు కళ్లు చెదిరే లాభాలు వస్తాయి.

More Telugu News