Revanth Reddy: ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై గవర్నర్ కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy wrote governor on question papers leak
  • కేటీఆర్ ఈ స్కాంను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న రేవంత్
  • కేవలం ఇద్దరు వ్యక్తుల తప్పిదంగా చిత్రీకరిస్తున్నారని విమర్శలు
  • సీబీఐ, ఈడీలకు సిఫారసు చేయాలంటూ గవర్నర్ కు లేఖ
టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం అంతా ఇద్దరు వ్యక్తుల దుశ్చర్య మాత్రమేనని మంత్రి కేటీఆర్ అంటున్నారని, ఈ స్కాంను కప్పిపుచ్చడానికి కేటీఆర్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 

టీఎస్ పీఎస్సీ గత ఎనిమిదేళ్లుగా మెరుగైన సేవలు అందించిందని పొగడడం ద్వారా ఈ కుంభకోణం ఎపిసోడ్ ను తక్కువ చేసి చూపేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నట్టు అర్థమవుతోందని తెలిపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు లేఖ రాశారు. 

ఈ కేసులో సిట్ విచారణతో ప్రవీణ్, రాజశేఖర్ అనే వ్యక్తులు దోషులుగా తెరపైకి వచ్చారని, ఇతరులతో పాటు వారిని కూడా అరెస్ట్ చేశారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే ఈ స్కామ్ ను ఇద్దరు వ్యక్తుల తప్పిదంగా కేటీఆర్ చిత్రిస్తుండడం విస్మయం కలిగిస్తోందని పేర్కొన్నారు. టీఎస్ పీఎస్సీ ఎంపికల విశ్వసనీయతపై ప్రభుత్వ వ్యవహారశైలి అనుమానాలు కలిగిస్తోందని రేవంత్ వివరించారు. 

ఈ కేసులో టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్, మంత్రి కేటీఆర్, సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులను కూడా బాధ్యులను చేయాలని రేవంత్ రెడ్డి తన లేఖలో కోరారు. నీచమైన ఉద్దేశాలతో తెలంగాణ యువత భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని, ఇందులో టీఎస్ పీఎస్సీ పాత్రపై విచారణ జరగాలని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సీబీఐ, ఈడీలకు సిఫారసు చేయాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. 

మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న మెడికల్ అడ్మిషన్ల 'వ్యాపమ్' కుంభకోణం తరహాలో ఇది కూడా తీవ్రస్థాయిలో ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో మంత్రుల ప్రాసిక్యూషన్ ను ఆమోదించేందుకు గవర్నర్ కు అధికారం ఉందని, ఇప్పుడు టీఎస్ పీఎస్సీ స్కాంలో కూడా మంత్రి కేటీఆర్, టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ తదితరులను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి మంజూరు చేయాలని కోరారు. మధ్యప్రదేశ్ లో ఇలాగే ఇద్దరు మంత్రుల ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించారని రేవంత్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు.
Revanth Reddy
Governor
Tamilisai Soundararajan
Question Papers Leak
KTR
Congress
BRS
Telangana

More Telugu News