Karnataka: తాయిలాలు కాదు.. వైద్య పరీక్షలు ఉచితంగా చేయించండి!

  • ఎన్నికల్లో హామీలపై కర్ణాటక నేతలకు వైద్యుల సూచన
  • చాలా వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించవచ్చని వెల్లడి
  • కర్ణాటక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలు
Promise to free health tests to people demands karnataka health department

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను కూడా విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు తాయిలాలు ఇవ్వడం కన్నా వారికి ఉచితంగా పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. రకరకాల తాయిలాల కన్నా వైద్య పరీక్షలు ఉచితంగా చేయించడం వారికి ఎంతో మేలు కలిగిస్తోందని వైద్య నిపుణులు, కర్ణాటక పరిశోధన సమాజం అధ్యక్షుడు డాక్టర్ కేఎన్ మనోహర్ చెప్పారు.

ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు అలవికాని హామీలు ఇవ్వొద్దని మనోహర్ అన్నారు. బ్లడ్ షుగర్, బీపీ, యూరిన్ తదితర పరీక్షలతో చాలా వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించే అవకాశం కలుగుతుందని డాక్టర్ మనోహర్ చెప్పారు. దీంతో ఆయా వ్యాధులకు చికిత్స తీసుకుంటూ బాధితులు తమ ప్రాణాలు కాపాడుకుంటారని తెలిపారు. మధుమేహం వల్ల బాధపడుతున్నవారి సంఖ్య చైనా తర్వాత మన దేశంలోనే అధికంగా ఉందన్నారు. రక్తం, షుగర్ లెవెల్స్‌ను క్రమం తప్పకుండా పరిశీలించడం చాలా ముఖ్యమని తెలిపారు. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాలుగు పరీక్షలకు కలిపి రూ.500 వరకు ఖర్చవుతుందని, ఎక్కువ మందికి ఏక కాలంలో ఈ పరీక్షలు చేయిస్తే ఖర్చు మరింత తగ్గుతుందని చెప్పారు. కార్డియాక్ అరెస్ట్, కిడ్నీ ఫెయిల్యూర్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ వంటివి ఒకదానితో మరొకటి సంబంధం కలవని చెప్పారు. ఇవి జీవనశైలి వ్యాధులని తెలిపారు. వీటిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే, ప్రమాదాలను నివారించవచ్చునని డాక్టర్ మనోహర్ తెలిపారు.

More Telugu News