Vizag Metro Rail: వైజాగ్ మెట్రో రైలు కోసం ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు: కేంద్రం

  • 2017లోనే మెట్రో రైలు పాలసీని రూపొందించామన్న కేంద్రమంత్రి
  • ఆర్థిక సాయం అందించేందుకు కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు ముందుకు రాలేదన్న హర్‌దీప్‌సింగ్ పూరి
  • ఏపీ ప్రభుత్వం మరే విదేశీ బ్యాంకును సంప్రదించలేదని స్పష్టీకరణ
AP did not send proposal on Visakha metro rail project says union minister

విశాఖపట్టణంలో మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి బదులిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. 2017లోనే మెట్రో రైలు పాలసీని రూపొందించామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన చేయలేదన్నారు. పీపీపీ విధానంలో లైట్‌రైల్ ప్రాజెక్టును నిర్మించాలని 2018లో అనుకున్నామని, ఇందుకు సంబంధించి ఆర్థిక సాయం అందించాల్సిందిగా కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకును కేంద్రం కోరినా, అది నిస్సహాయత వ్యక్తం చేసినట్టు సభకు తెలిపారు. ఈ విషయాన్ని 2019లోనే ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఆ ప్రాజెక్టుకు రుణసాయం కోసం ఇతర సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించినట్టు తెలిపారు. అయితే, ఏపీ ప్రభుత్వం మరే విదేశీ సంస్థకు దరఖాస్తు చేసుకోలేదని మంత్రి వివరించారు.  

అలాగే, లిథియం గనుల వేలానికి సంబంధించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిస్తూ.. కడప, అనంతపురం జిల్లాల్లో విస్తరించిన పార్నపల్లె-లోపనూతుల ప్రాంతంలోని లిథియం గనుల కాంపోజిట్ లైసెన్సులతో కలిపి వేలం వేసే బాధ్యతను ఏపీ ప్రభుత్వానికి అప్పగించినట్టు చెప్పారు. తాటిరెడ్డిపల్లె బ్లాక్‌లో గనిని లీజుకు తీసుకున్న వారు అక్కడ వెలికితీసే లిథియం ఖనిజ సగటు అమ్మకం ధరపై 12 శాతం రాయల్టీని ఏపీ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ బదులిస్తూ.. కాకినాడ-వైజాగ్‌-శ్రీకాకుళం మధ్య సహజవాయు సరఫరా పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తి గడువును జూన్ 2024 వరకు పొడిగించినట్టు చెప్పారు.

More Telugu News