Mitchell Starc: స్టార్క్ కు 5 వికెట్లు... టీమిండియా 117 ఆలౌట్

Starc gets 5 wickets as Team India bundled out for 117 in Visakhapatnam
  • విశాఖలో నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్ స్టార్క్
  • టీమిండియా లైనప్ విలవిల
  • అబ్బాట్ కు 3, ఎల్లిస్ కు 2 వికెట్లు
  • 29 పరుగులతో నాటౌట్ గా మిగిలిన అక్షర్ పటేల్
  • వన్డేల్లో మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసిన భారత్ 
విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ మైదానం టీమిండియాకు కలిసొచ్చిన మైదానం అని చెబుతారు. కానీ ఇవాళ ఆస్ట్రేలియా బౌలర్ల జోరుకు భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసి భారత్ ను చుట్టేశాడు. 

స్టార్క్ నిప్పులు చెరిగే బౌలింగ్ కు టాపార్డర్ దాసోహం అనగా, షాన్ అబ్బాట్ 3, నాథన్ ఎల్లిస్ 2 వికెట్లతో విజృంభించడంతో టీమిండియా విలవిల్లాడింది. 26 ఓవర్లల్లో 117 పరుగులకే ఆలౌట్ అయింది. వన్డేల్లో టీమిండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. 

ఆఖర్లో అక్షర్ పటేల్ కాస్త ధాటిగా ఆడడంతో టీమిండియాకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. అక్షర్ పటేల్ 29 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. స్టార్క్ ను అక్షర్ పటేల్ రెండు వరుస బంతుల్లో సిక్సులు కొట్టడం ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత కాసేపటికే సిరాజ్ ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా టీమిండియా ఇన్నింగ్స్ కు ముగింపు పలికాడు. 

జడేజా 16 పరుగులు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్ లో కోహ్లీ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. శుభ్ మాన్ గిల్ మరోసారి పేలవంగా అవుట్ కాగా, సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో మ్యాచ్ లో సున్నా పరుగులకే అవుటై గోల్డెన్ డక్ సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 13, కేఎల్ రాహుల్ 9, హార్దిక్ పాండ్యా 1 పరుగు చేసి వెనుదిరిగారు.
Mitchell Starc
Team India
Australia
2nd ODI
Visakhapatnam

More Telugu News