Women: పనిలో మహిళల పట్ల వివక్ష... నిదర్శనాలు ఇవే...!

Women paid less than men for same work in towns and villages
  • పురుషులతో పోలిస్తే మహిళలకు ఇచ్చేది సగం వేతనమే!
  • దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి
  • కేరళ, తమిళనాడు, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ వివక్ష
  • పట్టణ ప్రాంతాల్లో వేతనాల పరంగా కొంచెం తక్కువ అంతరం
  • జాతీయ గణాంక కార్యాలయం సర్వేలో వెల్లడి
పని ఎవరు చేసినా ఒక్కటే. మరి వేతనం దగ్గరకు వచ్చే సరికి మహిళల పట్ల వివక్ష ఎందుకు...? కంపెనీలు, కాంట్రాక్టర్లు ఈ విషయంలో ఇదే వైఖరి ప్రదర్శిస్తుండడాన్ని ఇప్పటి వరకు ఎన్నో సర్వేలు ఎత్తి చూపించాయి. జాతీయ గణాంక కార్యాలయం తాజాగా విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. 2022 సంవత్సరానికి సంబంధించి సర్వే ఫలితాలను ప్రకటించింది. 

2022 ఏప్రిల్-జూన్ కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళలకు ఇస్తున్న వేతనం 50 శాతం నుంచి గరిష్టంగా 93.7 శాతంగా ఉంది. మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో సగం, సగం కంటే కొంచెం ఎక్కువే వేతనం ఉండడం గమనించొచ్చు. 

2011 జూలై నుంచి 2012 జూన్ వరకు జాతీయ గణాంక కార్యాలయం నివేదికలోని (పదేళ్ల క్రితం నివేదిక) అంశాలతో పోల్చినప్పుడు... గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే మహిళలకు చెల్లించే వేతనం పరంగా అంతరం పెరిగింది. కాకపోతే పట్టణ ప్రాంతాల్లో వేతన చెల్లింపుల పరంగా వ్యత్యాసం కొంత తగ్గడం సంతోషించాల్సిన విషయం.

కేరళలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ అంతరం ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పురుషులకు సగటు రోజువారీ వేతనం రూ.842గా ఉంది. దేశంలో ఇదే గరిష్ఠ స్థాయి. కానీ, ఇదే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు చెల్లించే సగటు రోజువారీ వేతనం రూ.434. అంటే పురుషులు పొందుతున్న వేతనంలో మహిళలకు వస్తున్నది 51.5 శాతమే. పెద్ద రాష్ట్రాల్లోనే ఈ అంతరం ఎక్కువగా ఉన్నట్టు సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల రోజువారీ వేతనం మహిళలతో పోలిస్తే ఎంతో ఎక్కువగా ఉంది. పురుషులు పొందే వేతనంలో మహిళలకు 60 శాతం మించడం లేదు. 

యూపీ, అసోం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశాలోని గ్రామీణ పురుషులతో పోలిస్తే మహిళలకు 70 శాతం వరకు వేతనం లభిస్తోంది. హర్యానా, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మహిళల కంటే రోజువారీగా పురుషులకు రూ.400 వరకు అధిక వేతనం లభిస్తోంది. జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేతన వివక్ష తక్కువగా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు 80 శాతం వరకు పొందుతున్నారు.
Women
less wages
National Statistical Office
survey
men wages
wider gap

More Telugu News