CP Ranganath: వరంగల్ సీపీ చిత్రపటానికి రైతు పాలతో అభిషేకం.. ఎందుకంటే!

Farmer Couple Doing Palabhishekam For Warangal Cp Ranganath flex
  • తమ భూమిని కబ్జా చేశారంటూ ఐదేళ్లు పోరాడిన రైతు
  • అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయానని వెల్లడి
  • సీపీ రంగనాథ్ చొరవతో తన భూమి తనకు దక్కిందని సంతోషం
  • భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్న సీపీ
రాజకీయ నాయకులు, హీరోల చిత్రపటాలు, కటౌట్లను అభిమానులు పాలతో అభిషేకించడం తరచుగా చూస్తుంటాం.. అయితే, వరంగల్ లో మాత్రం పోలీస్ కమిషనర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశాడో రైతు. ఆయనే తమ పాలిట దైవమని ఆ రైతు దంపతులు చేతులెత్తి మొక్కుతున్నారు. కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక చివరికి సీపీ రంగనాథ్ ను ఆశ్రయించాకే తమ భూమి తమకు దక్కిందని చెబుతున్నారు. 

వరంగల్‌ జిల్లాలోని నర్సంపేటకు చెందిన రైతు వీరాస్వామి, రాజ్యలక్ష్మి దంపతుల భూమిని కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. తమ భూమి తమకు అప్పగించేలా చూడాలంటూ వీరాస్వామి దంపతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఐదేళ్లుగా అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా ఉపయోగంలేకుండా పోయింది. ఇటీవల వరంగల్‌ సీపీ రంగనాథ్‌ దృష్టికి తన సమస్యను తీసుకెళ్లారు.

కబ్జాదారులనుంచి తమ భూమిని విడిపించి, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రంగనాథ్‌ భూమిని కబ్జా చేసిన 11 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీపీ రంగనాథ్‌ చొరవతో తమ భూమి తమకు దక్కిందని వీరాస్వామి దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీ రంగనాథ్ ఫ్లెక్సీకి భార్యతో కలిసి వీరాస్వామి పాలాభిషేకం చేశాడు.
CP Ranganath
warangal
farmer couple
flex
palabhishekam

More Telugu News