Man: తన గాళ్ ఫ్రెండ్ ను ఆమె భర్త నుంచి విడిపించాలని హైకోర్టును కోరిన వ్యక్తి

Man approaches court to relieve his girl friend from her husband custody
  • గుజరాత్ లో ఘటన
  • ఓ యువతిని ప్రేమించిన వ్యక్తి
  • యువతికి వేరొక యువకుడితో పెళ్లి చేసిన తల్లిదండ్రులు
  • భర్త నుంచి వచ్చేసి ప్రియుడితో సహజీవనం చేసిన యువతి
  • మళ్లీ భర్త వద్దకు పంపిన కుటుంబ సభ్యులు
  • హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన ప్రియుడు
గుజరాత్ లో ఓ వ్యక్తి తన గాళ్ ఫ్రెండ్ కోసం హైకోర్టును ఆశ్రయించి జరిమానాకు గురయ్యాడు. బనస్కాంత జిల్లాకు చెందిన ఆ వ్యక్తి గతంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, ఆ అమ్మాయికి కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో వివాహం చేశారు. దాంతో, ఆమె ప్రియుడు దీన్ని భరించలేకపోయాడు. 

కొన్నాళ్లకు ఆ యువతి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఆమె భర్తను వదిలేసింది. అయితే పుట్టింటికి పోకుండా ప్రియుడి వద్దకు చేరి సహజీవనం చేయసాగింది. సహజీవనానికి సంబంధించి ఇద్దరూ ఓ అగ్రిమెంట్ పై సంతకాలు కూడా చేశారు. 

అయితే, ఆ యువతి కుటుంబ సభ్యులు, అత్తమామలు వచ్చి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లి భర్తకు అప్పగించారు. దాంతో ఆమె ప్రియుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తన ప్రేయసిని ఆమె భర్త నుంచి విడిపించాలంటూ న్యాయస్థానాన్ని కోరాడు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా భర్త చెరలో మగ్గిపోతోందని తెలిపాడు. ఆమెను భర్త నుంచి విడిపించి తీసుకువచ్చి, తనకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశాడు. 

ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం కూడా స్పందించింది. ఆ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను వ్యతిరేకిస్తూ, ఇటువంటి పిటిషన్ దాఖలు చేసే అర్హత అతడికి లేదని స్పష్టం చేసింది. ఆమె ఒకవేళ భర్త అధీనంలోనే ఉంటే దాన్ని అక్రమ నిర్బంధం అని ఎవరూ అనలేరని పేర్కొంది. 

వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... ఆమె భర్త నుంచి విడాకులు తీసుకోలేదని, ఆమె అక్రమ నిర్బంధంలో ఉన్నట్టు భావించలేమని స్పష్టం చేసింది. సహజీవన ఒప్పందం అంటూ కోర్టుకు వచ్చినందుకు సదరు వ్యక్తికి రూ.5,000 జరిమానా విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది.
Man
Girl Friend
Husband
Custody
High Court
Live In Relationship
Gujarat

More Telugu News