KL Rahul: ఫామ్ లో లేడన్నారు... ఇవాళ అతడే మ్యాచ్ గెలిపించాడు!

KL Rahul timely innings leads Team India victorious against Australia
  • స్వల్ప స్కోర్ల మ్యాచ్ లో టీమిండియానే విజేత
  • ఆసీస్ పై 5 వికెట్ల తేడాతో విజయం
  • 75 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్
  • రాణించిన జడేజా, హార్దిక్ పాండ్యా
  • సిరీస్ లో 1-0తో టీమిండియా ముందంజ
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా కాస్త కష్టంగానే అయినా, విజయం సాధించి సిరీస్ లో ముందంజ వేసింది. ముంబయి వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ స్వల్ప స్కోర్ల పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

గత కొన్నాళ్లుగా ఫామ్ లో లేడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ ఇవాళ ఎంతో సమయస్ఫూర్తితో ఆడి భారత్ ను గెలిపించాడు. 189 పరుగుల లక్ష్యఛేదనలో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాకు కేఎల్ రాహుల్ ఆపద్బాంధువుడయ్యాడు. 

మిడిలార్డర్ లో వచ్చిన కేఎల్ రాహుల్ 91 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. రాహుల్ స్కోరులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. రాహుల్ కు రవీంద్ర జడేజా నుంచి మెరుగైన సహకారం అందింది. జడేజా 69 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 25 పరుగులు చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అయితే  కేఎల్ రాహుల్, జడేజా జోడీ మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించింది. 

ఓపెనర్లు శుభ్ మాన్ గిల్ 20, ఇషాన్ కిషన్ 3 పరుగులు చేయగా... కోహ్లీ 4 పరుగులకే వెనుదిరగ్గా, సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, స్టొయినిస్ 2 వికెట్లు తీశారు. 

ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా 3 వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 19న విశాఖపట్నంలో జరగనుంది.
KL Rahul
Team India
Australia
1st ODI
Mumbai

More Telugu News