Kavitha: ఈడీ నుంచి కవితకు మళ్లీ పిలుపు!

ED notices mlc Kavita again in Delhi Liquor Scam
  • ఈడీ విచారణకు ఈ రోజు వెళ్లని కవిత
  • ఈనెల 20న తమ ముందు హాజరుకావాలంటూ మళ్లీ నోటీసులిచ్చిన అధికారులు
  • లిక్కర్ స్కామ్ విషయంలో ఢిల్లీలో కొనసాగుతున్న హైడ్రామా
లిక్కర్ స్కామ్ కేసు విషయంలో దేశ రాజధాని ఢిల్లీలో హైడ్రామా కొనసాగుతోంది. విచారణకు రావాలంటూ కవితకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం నోటీసులు పంపింది.

లిక్కర్ స్కామ్ కేసులో తొలిసారిగా ఈనెల 11న కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. రెండో విడత విచారణకు ఈరోజు కవిత హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె వెళ్లలేదు. ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, తీర్పు తర్వాత నిర్ణయం తీసుకుంటామని కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ చెప్పారు. అధికారులు అడిగిన డాక్యుమెంట్లను అందజేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మరోవైపు కవిత వేసిన పిటిషన్ పై ఈనెల 24న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కానీ దాని కంటే ముందే 20న హాజరుకావాలని ఈడీ స్పష్టం చేసింది. ఈరోజు ఈడీ ఆఫీసుకు వచ్చేందుకు నిరాకరించిన కవిత.. 20న మాత్రం విచారణకు హాజరవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ 20న కవిత హాజరుకాకపోతే ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Kavitha
Delhi Liquor Scam
Enforcement Directorate
BRS

More Telugu News