Rahul Gandhi: లండన్ లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్ లో రచ్చ

  • ఈ రోజు మొదలైన బడ్జెట్ రెండో విడత సమావేశాలు
  • లండన్ లో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల అసహనం
  • దేశాన్ని అవమానించిన రాహుల్ పై చర్యలు తీసుకోవాలన్న రాజ్ నాథ్ సింగ్
 BJP MPs sought an apology from Congress leader Rahul Gandhi for his UK remarks

బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ డిమాండ్ చేయడంతో పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల రెండో విడత సోమవారం వాడీవేడీగా ప్రారంభమైంది. లండన్‌లో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు మాట్లాడుతుండగా, ప్రతిపక్ష నేతలు సభా వెల్‌లోకి వచ్చారు. దేశాన్ని అవమానించిన రాహుల్ పై చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. 

‘ఈ సభలో సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ లండన్ లో భారత్ ను అవమానించారు. ఆయన వ్యాఖ్యలను ఈ సభలోని సభ్యులందరూ ఖండించాలని, సభ ముందు క్షమాపణ చెప్పాలని కోరాలని డిమాండ్ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష నేతలు వెల్ లోకి దూసుకొచ్చారు. దాంతో, స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక, బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థల దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహం వెలుపల ప్రతిపక్ష నాయకులు నిరసనకు దిగారు.

More Telugu News