hordings against bjp: మళ్లీ వెలిసిన హోర్డింగ్స్.. ‘వాషింగ్ పౌడర్ నిర్మా’తో అమిత్ షాకు ఆహ్వానం!

  • బీజేపీ టార్గెట్ గా హైదరాబాద్ లో హోర్డింగ్స్
  • ‘బీజేపీలో చేరితే మరకలు పోతాయి’ అంటూ ఎద్దేవా
  • హైదరాబాద్ కు అమిత్ షా వచ్చిన సందర్భంగా ఏర్పాటు
hordings against bjp appeared in hyderabad

బీజేపీని టార్గెట్ చేస్తూ హైదరాబాద్‌లో మరోసారి హోర్డింగులు వెలిశాయి. కవితను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో నిన్న బీజేపీని ఎద్దేవా చేస్తూ పోస్టర్లు, హోర్డింగులు పెట్టారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన సందర్భంగా హోర్డింగులు దర్శనమిచ్చాయి.

‘బీజేపీలో చేరితే మరకలు పోతాయి’ అని అర్థం వచ్చేట్టుగా ఈ హోర్డింగులను పెట్టారు. హోర్డింగ్ పై భాగంలో వాషింగ్ పౌడర్ నిర్మా అని.. కింది భాగంలో ‘వెల్‌కమ్‌ టు అమిత్‌ షా’ అని రాశారు. 

నిర్మా యాడ్ లో ఉండే అమ్మాయి ఫొటోలో ముఖాన్ని మార్చారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన హిమంత బిశ్వ శర్మ, నారాయణ్ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి ఈశ్వరప్ప, జ్యోతిరాదిత్య సింధియా, విరూపాక్షప్ప, అరుణ్ ఖోట్కర్ మొఖాలను పెట్టారు. నిన్నటి మాదిరే ఈ రోజు కూడా హోర్డింగ్స్ ఎవరు వేశారనే వివరాలు పెట్టకపోవడం గమనార్హం.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిన్న 8 గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. దీంతో శనివారం ఉదయమే పలు ప్రాంతాల్లో కవితకు మద్దతుగా పోస్టర్లు, హోర్డింగ్ లు దర్శనమిచ్చాయి. పలు రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొన్న నేతలు కొందరు, తర్వాత బీజేపీలో చేరడాన్ని అందులో పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన కవితపై ఎంతటి వేధింపులకు పాల్పడుతున్నా, ఆమె మాత్రం వారిలా రంగులు మార్చలేదని అర్థం వచ్చేలా పేర్కొన్నారు. పదితలల రావణుడిగా మోదీ ఫొటోను కూడా ఏర్పాటు చేశారు.

More Telugu News