paper straw: పాలిథీన్ కవర్ లో పేపర్ స్ట్రా.. కంపెనీల చిత్తశుద్ధి ఇదీ..!

Pic of paper straw wrapped in plastic goes viral twitter
  • టెట్రా ప్యాక్ లతో పేపర్ స్ట్రాలను అందిస్తున్న కంపెనీలు
  • వాటిని పాలిథీన్ కవర్ లో ప్యాక్ చేస్తున్న వైనం
  • ట్విట్టర్ వేదికగా ప్రస్తావించిన నెటిజన్
  • కంపెనీల్లో మార్పు వస్తుందన్న ఆశాభావం
ఒక్కసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్, పాలిథీన్ ఉత్పత్తులను కేంద్ర సర్కారు నిషేధించింది. మజా, ఫ్రూటీ టెట్రా ప్యాక్ లను కొనుగోలు చేసినప్పుడు వాటితోపాటు స్ట్రా రావడం చూసే ఉంటారు. అవి ప్లాస్టిక్ తో చేసినవే. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ కనుక అవి కూడా నిషేధం పరిధిలోకి వచ్చాయి. దీంతో కంపెనీలు పేపర్ స్ట్రాలను టెట్రా ప్యాక్ పానీయాలతో పాటు అందిస్తున్నాయి.

ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే.. నిబంధనల మేరకు ప్లాస్టిక్ స్ట్రాలను తొలగించిన కంపెనీలు.. టెట్రా ప్యాక్ తో ఇచ్చే పేపర్ స్ట్రాని మాత్రం పాలిథీన్ కవర్ లో ప్యాక్ చేసి ఇస్తున్నాయి. స్ట్రాపై దుమ్ము పడకుండా రక్షణగా పాలిథీన్ కవర్ తో క్లోజ్డ్ ప్యాక్ చేసి టెట్రాప్యాక్ లకు అనుసంధానంగా ఇస్తున్నాయి. కంపెనీల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని చెప్పుకోవాలి.  ఒకవైపు కాలుష్యం నివారణ కోసం పనిచేస్తూనే.. మరోవైపు ఇంకో రూపంలో కాలుష్యానికి కారణమవుతుండడం గమనించొచ్చు.

ఈ అంశాన్ని ట్విట్టర్ లో చర్చకు చేపట్టారు కొందరు నెటిజన్లు. ప్రేరణచెట్టి అనే యువతి పాలిథీన్ కవర్ లో ప్యాక్ చేసిన పేపర్ స్ట్రా ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది అతిపెద్ద జోక్ అని ఆమె అభివర్ణించారు. అలాగే, పేపర్ స్ట్రాని పేపర్ కవర్ తో ప్యాక్ చేసిన మరో ఫొటోని కూడా కింద పోస్ట్ చేసి, ఇలా ఉండాలంటూ ట్వీట్ చేసింది. కంపెనీలు దీన్ని అర్థం చేసుకుని, పేపర్ తో ప్యాక్ చేస్తాయన్న ఆశాభావాన్ని ఓ నెటిజన్ వ్యక్తం చేశాడు. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ తో పర్యావరణ కాలుష్యానికి పెద్ద ఎత్తున ముప్పు ఉంటుంది. ఇవి నేలలో కరిగిపోవడానికి వందల, వేల సంవత్సరాల సమయం పడుతుంది. నీటితో కలసి విషతుల్యంగా మారతాయి. అంతిమంగా మన ఆరోగ్యానికి హాని తెచ్చిపెడతాయి.
paper straw
plastic cover
tetra pack
juices
twitter
viral

More Telugu News