K Kavitha: న్యాయ నిపుణుల సలహా తీసుకుంటా: కవిత

 KCR daughter Kavitha response on ED summons in Delhi liquor scam
  • ఈ నెల 9న విచారణకు హాజరు కావాలంటూ కవితకు ఈడీ సమన్లు
  • మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం పోరాడుతున్నందుకే ఇదంతా జరుగుతోందన్న కవిత
  • ఢిల్లీ ముందు తెలంగాణ మోకరిల్లదంటూ వ్యాఖ్య
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9న (రేపు) ఢిల్లీలోని తమ కార్యాలయంలో తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ లిక్కర్ బిజినెస్ మేన్ అరుణ్ రామచంద్రి పిళ్లై గత సోమవారం ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన కవితకు బినామీ అని ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ దే కీలక పాత్ర అని... ఇందులో అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ రెడ్డి, వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కల్వకుంట్ల కవిత కీలక పాత్రధారులని ఈడీ అభియోగాలు మోపింది.  

తనకు ఈడీ సమన్లు వచ్చిన నేపథ్యంలో కవిత ఒక ప్రకటనను విడుదల చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు  చాలా కాలంగా పెండిగ్ లో ఉందని... ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. ఈ నెల 10న ఢిల్లీలోని జంత్ మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం భారత్ జాగృతి, ప్రతిపక్ష పార్టీలు, దేశ వ్యాప్తంగా  ఉన్న మహిళా సంఘాలు ధర్నా చేస్తాయని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే 9వ తేదీన విచారణకు హాజరు కావాలని తనకు సమన్లు జారీ చేశారని ఆరోపించారు. బాధ్యత గల భారత పౌరురాలిగా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అయితే ధర్నాకు సంబంధించి ముందుగానే నిర్ణయించిన షెడ్యూల్ నేపథ్యంలో... ఆరోజు విచారణకు హాజరయ్యే విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటానని తెలిపారు. 

కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తున్న తమ నేత కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని కవిత మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై తాము పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ప్రజలను అణగదొక్కుతున్న ఢిల్లీ ప్రభుత్వం ముందు తెలంగాణ మోకరిల్లదనే విషయాన్ని తాను స్పష్టంగా చెపుతున్నానని అన్నారు.
K Kavitha
KCR
BRS
Enforcement Directorate
Summons

More Telugu News