ipl: ఐపీఎల్ లో జెర్సీ మార్చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Lucknow Super Giants launch new jersey ahead of IPL 2023
  • 2023 సీజన్ లో వాడే కొత్త జెర్సీని ఆవిష్కరించిన జైషా
  • గతేడాది ఆకుపచ్చ–నీలం రంగు జెర్సీ వాడిన లక్నో
  • ఈసారి ముదురు నీలం రంగు జెర్సీతో బరిలోకి దిగుతున్న జట్టు
గతేడాది ఐపీఎల్ లో అరంగేట్రం చేసి తొలి సీజన్ లో సత్తా చాటిన లక్నో సూపర్ జెయింట్స్ ఈసారి సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 2023లో లక్నో ఆటగాళ్లు ధరించే ముదురు నీలి రంగు జెర్సీని బీసీసీఐ కార్యదర్శి జై షా మంగళవారం ఆవిష్కరించారు. 2022లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో ఆకుపచ్చ–నీలం రంగు జెర్సీని ఉపయోగించింది. ఈ సారి తమ లుక్ ను పూర్తిగా మార్చేసింది. కొత్త జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వహించిన ఫ్యాషన్ వేడుకలో కేఎల్ రాహుల్ సహా పలువురు లక్నో క్రికెటర్లు దాన్ని ధరించారు. రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, జైదేవ్ ఉనాద్కట్, దీపక్ హుడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లక్నో యజమాని సంజీవ్ గోయెంకా, టీమ్ మెంటార్ గౌతం గంభీర్ కూడా హాజరయ్యారు.

జెర్సీ ముందు భాగంలో ఎరుపు చారలు కనిపించాయి. 2023 ఐపీఎల్ లో కొత్త జెర్సీ తమకు అవసరమైన అదృష్టాన్ని తెస్తుందని జట్టు భావిస్తోంది. కాగా, గతేడాది లీగ్ లో లక్నో గొప్పగా రాణించింది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది. రాహుల్ నాయకత్వంలో 17 మ్యాచ్ లలో తొమ్మిది గెలుపొంది అరంగేట్రం సీజన్ లోనే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. 2023 సీజన్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు భారత టీ20 జట్టులో స్థానం కోల్పోయిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ తో తిరిగి గాడిలో పడాలని చూస్తున్నాడు.
ipl
2023
Lucknow Super Giants
new jersey

More Telugu News