USA: అమెరికాలో కూలిన విమానం.. భారత సంతతి మహిళ దుర్మరణం

Indian Origin Woman Dead In Plane Crash In New York Area Daughter Critical
  • గాల్లో ఉండగా మంటలు రేగడంతో కూలిన శిక్షణ విమానం
  • ఫ్లైట్‌లో భారత సంతతికి చెందిన తల్లీకూతుళ్లు
  • తల్లి దుర్మరణం, కూతురి పరిస్థితి విషమం
అమెరికాలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతి మహిళ దుర్మరణం చెందారు. ఆమె కూతురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే 23 ఏళ్ల పైలట్ పరిస్థితి కూడా క్రిటికల్ గా వుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పైలట్ ట్రైనింగ్‌పై ఆసక్తిగల వారి కోసం ఉద్దేశించిన డెమాన్‌స్ట్రేషన్ ఫ్లైట్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. 

ప్రమాద సమయంలో విమానంలో రోమా గుప్తా(63), ఆమె కూతురు రీవా గుప్తా(33) ఉన్నారు. ప్రమాదానికి ముందు కాక్‌పిట్‌లో పొగ వస్తున్న విషయాన్ని పైలట్ గ్రౌండ్ కంట్రోల్‌కు తెలియజేశాడు. ఆ తరువాత కొద్ది సేపటికే విమానంలో మంటలు రేగడంతో అది న్యూయార్క్‌ ఏరియాలో కూలిపోయింది. లాంగ్ ఐల్యాండ్‌లోని రిపబ్లికన్ ఎయిర్‌పోర్టుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ విమానం డానీ వైజ్‌మ్యాన్ ఫ్లైట్ స్కూల్‌కు చెందినదిగా తేలింది. 

ఈ ప్రమాదంపై డానీ వైజ్‌మ్యాన్ ఫ్లైట్ స్కూల్ లాయర్ స్పందించారు. విమానానికి అన్ని భద్రతాపరమైన తనిఖీలూ జరిగాయని, ఎటువంటి లోపం బయటపడలేదని పేర్కొన్నారు. గతవారం చివరిసారిగా విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో పాటూ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా దర్యాప్తు ప్రారంభించింది. మంగళవారం వారు మరోమారు విమానం కూలిపోయిన ప్రదేశాన్ని సందర్శించనున్నారు.
USA

More Telugu News