ISRO: వెయ్యి కేజీల ఉపగ్రహాన్ని కూల్చేయనున్న ఇస్రో.. ఎందుకంటే..!

  • మేఘా ట్రాపికే-1 శాటిలైట్‌ను కూల్చేయనున్న ఇస్రో 
  • ఉపగ్రహం జీవితకాలం ముగియడంతో కూల్చివేతకు నిర్ణయం
  • యూఎన్ఐఏడీసీ నిబంధనలకు అనుగుణంగా శాటిలైట్‌ కూల్చివేత
isro is all set to crash megha tropiques 1 satellite today

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు ఓ ఉపగ్రహాన్ని కూల్చేయనుంది. 2011లో ప్రయోగించిన వెయ్యి కిలోల మేఘా ట్రాపికే-1 జీవితకాలం ముగియడంతో దాన్ని నియంత్రిత విధానంలో కూల్చేసేందుకు నిర్ణయించింది. వాతావరణ పరిశీలనకు ఉద్దేశించిన ఈ ఉపగ్రహాన్ని ఇస్రో, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ (సీఎన్ఈఎస్) సంయుక్తంగా ప్రయోగించాయి. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో స్వయంగా నిర్మించింది. అంతరిక్ష వ్యర్థాల నిర్వహణకు సంబంధించి యూఎన్ఐఏడీసీ నిబంధనలకు కట్టుబడ్డ భారత్ మేఘా ట్రాపికే-1ను కూల్చేసేందుకు నిర్ణయించింది. 

మేఘా ట్రాపికే-1 కూల్చేవేతకు ఇస్రో గతేడాది ఆగస్టులోనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా శాటిలైట్‌ను తక్కువ ఎత్తులోని కక్ష్యల్లోకి దింపుతూ వస్తోంది. ఇప్పటివరకూ మొత్తం 18 సార్లు ఉపగ్రహ గమనాన్ని ఇస్రో మార్చింది. నేడు ఉపగ్రహం భూవాతావరణంలోకి ప్రవేశించి ఆ తరువాత మండి బూడిదైపోతుంది. ఎటువంటి ప్రమాదం లేని ప్రాంతం గుండా శాటిలైట్‌ను భూవాతావరణంలోకి ప్రవేశించేలా ఇస్రో చర్యలు తీసుకుంది. శాటిలైట్‌లో ఇప్పటికీ 125 కేజీల ఇధనం ఉందని తెలిపింది. నియంత్రిత విధానంలో ఉపగ్రహ గమనాన్ని మార్చేందుకు ఈ ఇంధనం సరిపోతుందని పేర్కొంది. ఉపగ్రహంలో ఇంకా ఇంధనం మిగిలుండటం కూడా కూల్చివేతకు ఓ కారణమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది. శాటిలైట్‌లో ఇంధనం మిగిలుంటే ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News