Celebrites: వాణిజ్య ప్రకటనల్లో ఎందుకు నటిస్తున్నారో చెప్పాలి: సెలబ్రిటీలకు కేంద్రం నూతన మార్గదర్శకాలు

  • యాడ్స్ లో నటిస్తున్న సెలబ్రిటీలు
  • ఇకపై సదరు ఉత్పత్తిని సెలబ్రిటీలు ఉపయోగించాలన్న కేంద్రం
  • ఆ తర్వాతే యాడ్ లో దాని గురించి చెప్పాలని స్పష్టీకరణ
Union Govt issues new guidelines for celebrities and social media influencers

సెలబ్రిటీలకు కోట్లాది మంది అభిమానులు ఉండడం తెలిసిందే. అందుకే అనేక కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారానికి సెలబ్రిటీలను ఎంచుకుంటాయి. అయితే, భారత్ లో సెలబ్రిటీలకు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 

సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు ఇకపై తాము వాణిజ్య ప్రకటనల్లో ఎందుకు నటిస్తున్నారో వినియోగదారులకు అర్థమయ్యేలా విపులంగా చెప్పాల్సి ఉంటుంది. ఆ ఉత్పత్తిని తాము ఉపయోగించి, దాని ఫలితాలను, తమ అనుభవాలను కూడా విడమర్చి చెప్పాల్సి ఉంటుంది. 

సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు చేసే యాడ్స్ చాలావరకు వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ భావిస్తోంది. అంతేకాదు, ఆయా ఉత్పత్తుల ప్రచారంలో పేర్కొన్న అంశాలు... వాటి వినియోగంలోకి వచ్చేసరికి కనిపించడంలేదని వినియోగదారుల వ్యవహారాల శాఖ గుర్తించింది. 

ఈ నేపథ్యంలో, సెలబ్రిటీలు/సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు ఏదైనా ఉత్పత్తిని తాము వాడిన తర్వాతే ప్రచారం చేయాలని, ఆ ఉత్పత్తిని వాడినప్పుడు ఎదురైన ఫలితాలు, అనుభవాలను సదరు ప్రకటనలో కచ్చితంగా వివరించాలని తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. టెక్ట్స్ కానీ, ఆడియో రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ వివరించాలని పేర్కొంది. 

అంతేకాదు, లైవ్ లో యాడ్ క్యాంపెయినింగ్ చేస్తున్నట్టయితే... ఆ ప్రచారం ఎందుకు చేస్తున్నామన్న సమాచారాన్ని స్క్రీన్ పై ప్రదర్శించాలని స్పష్టం చేసింది. సామాజిక మధ్యమాల్లో ప్రచారం చేస్తుంటే... హ్యాష్ ట్యాగ్ తో తెలియజేయాలని పేర్కొంది. 

ఒకవేళ.... సదరు కంపెనీతో సెలబ్రిటీలు/సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ ఒప్పందం కుదుర్చుకున్నా, లేక భాగస్వామ్యం కలిగి ఉన్నా... ఆ విషయం కూడా యాడ్ లో స్పష్టంగా వినియోగదారులకు తెలియజేయాలని కేంద్రం వివరించింది. 

దేశంలో వినియోగదారుల చట్టం మరింత బలోపేతం అయ్యేలా, చట్టాన్ని అతిక్రమిస్తూ సాగే ఉత్పత్తుల ప్రచారానికి తెర దించేందుకు ఈ కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడతాయని కేంద్రం వెల్లడించింది.

More Telugu News