Russia: రికార్డు స్థాయిలో భారత్‌లోకి రష్యా చమురు దిగుమతులు! రోజుకు ఎంతంటే..

  • ఫిబ్రవరిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెల్స్ రష్యా చమురు దిగుమతి 
  • భారత్‌కు చమురు ఎగుమతిలో ఇరాన్, సౌదీ అరేబియాను వెనక్కు నెట్టిన రష్యా
  • వర్టెక్స్ సంస్థ పరిశీలనలో వెల్లడి
Indias Russian Oil Imports Hit Record High In Feb

భారత్‌లోకి రష్యా చమురు దిగుమతులు ఫిబ్రవరిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారల్స్‌‌ మేర రికార్డు స్థాయికి చేరుకుందని చమురు రవాణా వ్యవహారాలను పరిశీలించే వర్టెక్సా సంస్థ తాజాగా పేర్కొంది. ఇరాక్, సౌదీ అరేబియా నుంచి భారత్ దిగుమతి చేసుకునే చమురు కంటే ఇది అధికమని తెలిపింది. వరుసగా ఐదు నెలల పాటు రష్యా భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా నిలిచిందని వెల్లడించింది. 2022 ఫిబ్రవరిలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 1 శాతం కాగా.. ఉక్రెయిన్ యుద్ధం తరువాత ఇది ఏకంగా 35 శాతానికి చేరుకుందని చెప్పింది. 

ప్రపంచంలోని అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో చైనా, అమెరికా తరువాతి స్థానం భారత్‌దే. తక్కువ ధరకు అందుబాటులో ఉన్న రష్యా చమురును భారత్ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో సౌదీ అరేబియా, అమెరికా నుంచి చమురు దిగుమతులు సన్నగిల్లాయి. నెలవారీగా చూస్తే సౌదీ నుంచి దిగుమతులు 16 శాతం తగ్గగా అమెరికా దిగుమతులు ఏకంగా 38 శాతం మేర పడిపోయాయి. రష్యా చమురుపై అమెరికా విధించిన ఆంక్షలు భారత్‌కు ప్రయోజనకారిగా మారాయి.   

భారత్‌కు ప్రధాన చమురు ఎగుమతి దారులుగా ఉన్న ఇరాక్, సౌదీ అరేబియాను రష్యా వెనక్కు నెట్టిందని వర్టెక్సా సంస్థ పేర్కొంది. ఇరు దేశాల మొత్తం చమురు దిగుమతుల కంటే రష్యా చమురు దిగుమతి అధికమని పేర్కొంది. ‘‘అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకూ భారత రిఫైనరీలకు రష్యా చమురు దిగుమతులు కొనసాగుతాయి’’ అని వర్టెక్సా పేర్కొంది.

More Telugu News