Adani: ‘అదానీ’ పెట్టుబడులతో మా దేశంలో సంపద సృష్టి.. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని ప్రశంసలు

  • అదానీ గ్రూప్‌కు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ ఆబట్ ధన్యవాదాలు
  • తమ దేశంపై అదానీ గ్రూప్ విశ్వాసం నిలిపిందని వ్యాఖ్య
  • హిండెన్‌బర్గ్ సంస్థ ఆరోపణలు చేసినంత మాత్రాన అవి నిజాలైపోవని వ్యాఖ్య
Grateful Adani Group Has Shown Faith In Australia says Ex PM Tony Abbott

ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌పై ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ ఆబట్ తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. తమ దేశంపై విశ్వాసంతో భారీగా పెట్టుబడులు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. హిండెన్‌బర్గ్ నివేదికపై కూడా స్పందించిన ఆయన.. ఆరోపణలు వచ్చినంత మాత్రాన నేరం చేసినట్టు కాదని వ్యాఖ్యానించారు. ఓ జాతీయ ఛానల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

‘‘ఆరోపణలు చేయడం సులువే. కానీ.. తప్పు జరిగిందని ఆరోపించినంత మాత్రాన అది నిజమైపోదు. నేరం రుజువయ్యే వరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిర్దోషులే. కాబట్టి.. హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో వాస్తవం ఉంటే దానిపై దర్యాప్తు సంస్థలు దృష్టిసారిస్తాయి. అయితే.. ఆస్ట్రేలియాపై విశ్వాసం నిలిపి ఉంచినందుకు అదానీ సంస్థలకు నేను ధన్యవాదాలు చెబుతున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో బొగ్గు వెలికితీతపై అదానీ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అదానీ పెట్టుబడులతో ఆస్ట్రేలియాలో సంపద, ఉద్యోగాల సృష్టి జరిగిందని టోనీ ఆబట్ పేర్కొన్నారు. అంతేకాకుండా..అదానీ గ్రూప్ ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గుతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్షల మంది భారతీయులకు నిరంతర విద్యుత్ సదుపాయాన్ని కల్పించిందన్నారు. గతేడాది ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం కారణంగానే ఇదంతా సాధ్యమైందని తెలిపారు. ‘‘మునుపటి ఒప్పందంతో భారత్‌లోకి ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతులపై సుంకాలు తొలగిపోయాయి. దీంతో.. అదానీ గ్రూప్ ఎటువంటి సుంకాలు లేకుండానే ఆస్ట్రేలియా బొగ్గును దిగుమతి చేసుకోగలిగింది’’ అని వెల్లడించారు. 

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో అదానీ గ్రూప్ చేపట్టిన బొగ్గు తవ్వకాలపై అప్పట్లో వివాదం చెలరేగింది. ఇది పర్యావరణానికి హానికరమంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అయితే..అప్పటి టోనీ అబాట్ ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు మద్దతుగా నిలిచింది.

  • Loading...

More Telugu News