visakhapatnam: విశాఖ తీరానికి పోటెత్తిన పెట్టుబడులు.. రెండో రోజు రూ.1.15 లక్షల కోట్ల ఒప్పందాలు

CM Jagan said thanks to all for Global investor summit visakhapatnam success
  • రెండు రోజుల్లో 352 అవగాహన ఒప్పందాలు
  • మొత్తం రూ.13.05 లక్షల కోట్ల పెట్టుబడులు
  • వీటితో 6.3 లక్షల మందికి ఉపాధి
  • సదస్సు విజయం కావడంపై సీఎం జగన్ ధన్యవాదాలు
ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు) రెండో రోజూ భారీగా ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. శనివారం రూ.1.15 లక్షల కోట్ల విలువ చేసే 248 ఒప్పందాలపై పరిశ్రమలు, ప్రభుత్వం సంతకాలు చేశాయి. 

సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో మొత్తం 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, రూ.13.05 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని ప్రకటించారు. 6.3 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 

గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించినట్టు చెప్పారు. ఏపీని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 

సదస్సులో భాగంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్ తోపాటు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు.. భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర కే ఎల్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి, హెటెరో గ్రూప్ ఎండీ డాక్టర్ వంశీ కృష్ణ, లారస్ ల్యాబ్స్ సీఈవో సత్యనారాయణ చావా తదితరులు మాట్లాడారు. ఏపీలో తాము 5 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు సత్యనారాయణ చెప్పారు. కెమికల్స్, లాజిస్టిక్స్, ఫార్మా రంగంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. 

మంత్రులు గుడివాడ అమర్నాధ్, రోజా, ధర్మాన ప్రసాద్, విడదల రజని, సీదిరి అప్పలరాజు తదతరులు పాల్గొనగా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

రెండో రోజు కుదిరిన ఎంవోయూలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.50,000 కోట్లు, హెచ్ పీసీఎల్ ఎనర్జీ రూ.14,320 కోట్లు, టీవీఎస్ ఐఎల్ సీ రూ.1,500 కోట్లు, ఎకో స్టీల్ రూ.894 కోట్లు, బ్లూస్టార్ రూ.890 కోట్లు, ఎస్2పీ సోలార్ సిస్టమ్స్ రూ.850 కోట్లు, గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ రూ.800 కోట్లు, ఎక్స్ ప్రెస్ వెల్ రీసోర్సెస్ రూ.800 కోట్లు, రామ్ కో రూ.750 కోట్లు, క్రిబ్కో గ్రీన్ రూ.725 కోట్లు, తాజ్ గ్రూప్ రూ.700 కోట్లు, దాల్మియా రూ.650 కోట్లు ప్రముఖమైనవి.
visakhapatnam
vizag
Global investor summit
success
cm jagan
mou
investments

More Telugu News