Nara Lokesh: ​పాదయాత్రలో లోకేశ్ ను సర్ ప్రైజ్ చేసిన పయ్యావుల, అమర్నాథ్ రెడ్డి

TDP senior leaders surprises Nara Lokesh

  • పుంగనూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీలు
  • ప్రజలతో కలిసి క్యూలో నిల్చున్న టీడీపీ సీనియర్ నేతలు
  • తమకూ సెల్ఫీ కావాలంటూ లోకేశ్ ను కోరిన వైనం
  • చిరునవ్వులు చిందించిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 33వ రోజు పుంగనూరు నియోజకవర్గంలో ఉత్సాహభరితంగా సాగింది. కొమ్మురెడ్డిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్రకు నియోజకవర్గ ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. కొమ్మురెడ్డిపల్లిలో పాదయాత్ర ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత బ‌చ్చుల అర్జునుడు గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా అర్జునుడు అందించిన సేవలను లోకేశ్ కొనియాడారు. 

అనంతరం క్యాంప్ సైట్ వద్ద లోకేశ్ అభిమానులకు సెల్ఫీలు ఇస్తున్న సమయంలో పార్టీ సీనియర్ నేతలు పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సర్ ప్రైజ్ చేశారు. సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ప్రజలతో కలిసి నేతలు ఇద్దరూ క్యూలో నిలబడ్డారు. తమకు కూడా సెల్ఫీ కావాలని సీనియర్ నాయకులు అడగడంతో లోకేశ్ చిరునవ్వులు చిందించారు. ప్రజా సమస్యల పోరాటం కోసం గట్టిగా పోరాడుతున్నారంటూ వారు లోకేశ్ ను అభినందించారు.

టీడీపీ కార్యకర్తలను వేధిస్తే తాటతీస్తా!

పులిచర్ల సెంటర్ లో స్టూల్ పై నిలబడి లోకేశ్ స్థానికుల నుద్దేశించి ప్రసంగించారు. "ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డిని 43 వేల మెజారిటీతో గెలిపించారు. మీ సంక్షేమం కోసం ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. పాడి, మామిడిరైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. పుంగనూరులో ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి పాపాలే. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దు. పుంగనూరులో టీడీపీ జెండాను ఎగురువేయండి. నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా ఏ అధికారినైనా వదిలే ప్రసక్తిలేదు. వాళ్ల తాట తీస్తా" అంటూ హెచ్చరించారు.

మ‌హిళ‌ల భ‌ద్రత‌కి దిక్కులేని దిశ ఇందుకా?

పాదయాత్ర దారిలో దిశా వాహనాన్ని చూసిన లోకేశ్ ఆ వాహనం ఎదుట సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న చిత్తూరు ఎస్పీ ప్రెస్ మీట్ సమయంలోనే చంద్రగిరిలో గంజాయి దొరికిందని, అందుకునే ఇకపై జగన్ మోహన్ రెడ్డిని గంజాయి మోహన్ రెడ్డి అని పిలుస్తానని ఎద్దేవా చేశారు. 

"గంజాయి మోహన్ రెడ్డి ఇంటి సమీపంలోనే అంధురాలైన ద‌ళిత యువ‌తిని గంజాయి మ‌త్తులో ఒక‌డు దారుణంగా న‌రికేస్తే అప్పుడు దిశ పోలీసులూ, దిశ‌ వాహ‌నం రాలేదు. దిశ చ‌ట్టం లేక‌పోయినా రంగులు వేసి, పేర్లు పెట్టిన దిశ వాహ‌నాలలో పోలీసులు ఇదిగో ఇలా నా ద‌గ్గర మైకు లాక్కోవ‌డానికి నా వెంట తిరుగుతున్నారు. పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం కొత్తపేట ద‌గ్గర న‌న్ను ఫాలో అవుతున్న దిశ వాహ‌నం ఇది" అంటూ లోకేశ్ ఆ వాహనాన్ని చూపించారు. 

లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...

  • నాలుగేళ్లలో పాపాల పెద్దిరెడ్డి దోచింది రూ.10వేల కోట్లు!
  • అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి చేసిన పాపాలన్నీ బయటకు తీస్తాం
  • పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పెద్దిరెడ్డి ప్రోద్బలంతో పోలీసులు అడుగడుగునా ఇబ్బందిపెడుతున్నారు. వారందరి పేర్లు నేను రాసుకుంటున్నా.
  • పుంగనూరులో చల్లా బాబుకు అండగా నిలబడండి.
  • కార్యకర్తల ఉత్సాహం...ఉత్తేజం చూస్తుంటే 2024లో పుంగనూరు నియోజకవర్గంలో పసుపుజెండా ఎగరడం ఖాయమని తెలుస్తోంది.
  • నేను మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఏనాడూ నన్ను ఏమీ అడగలేదు. అయినా నేను ఈ పుంగనూరుకు రూ.100 కోట్లు కేటాయించాను. వాటికి కూడా పెద్దిరెడ్డి అడ్డుపడ్డాడు.
  • 2024లో బాబు ప్రమాణస్వీకారం... 2025లో జాబ్ క్యాలండర్ ఖాయం.
  •  యువగళం ప్రారంభమై 33 రోజులే అయ్యింది... దీన్ని చూసి తాడేపల్లి పిల్లి ఇంట్లో టీవీలు పగులకొడుతున్నాడు!
  • నేను టెర్రరిస్టును కాదు... వారియర్ ని... బెదిరింపులకు భయపడను.
  • జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు చివరకు పోలీసులు కూడా బాధితులే.
  • రాయలసీమకు పట్టిన శని ఈ గంజాయి మోహన్ రెడ్డి. ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా జగన్ రెడ్డి పూర్తిచేయలేదు... ఇతనొక దద్దమ్మ!
  • అప్పర్ తుంగభద్ర పై కర్నాటకలో ప్రాజెక్టు కడుతున్నారు. అది పూర్తయితే భవిష్యత్తులో రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. వైసీపీ ఎంపీలు ఒక్కరు కూడా నోరు విప్పలేదు.
  • రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక 10 మంది మైనారిటీలను హత్యచేశారు. అబ్దుల్ సలాం కుటుంబం, మిస్బా, ఇబ్రహీంలను వైసీపీ ప్రభుత్వం పొట్టనబెట్టుకుంది. 
  • వైసీపీ పాలనలో పుంగనూరులో మైనారిటీలపై 12 మందిపై కేసులు పెట్టారు. 
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలను కలిపి మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తాం.

ప్రపంచంలో ఏడా దొర‌క‌ని స‌రుకు మ‌న ఆంధ్రప్రదేశ్‌లోనే త‌యార‌వుద్ది!: లోకేశ్ వ్యంగ్యం

పుంగనూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర దారిలో మద్యాన్ని తీసుకెళ్తున్న ఓ వ్యాన్ వద్ద నిలబడి లోకేశ్ సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏడా దొర‌క‌ని స‌రుకు మ‌న ఆంధ్రప్రదేశ్‌లోనే త‌యార‌వుద్ది అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"నేను రోజూ సెప్తా వుండానే ప్రాణాలు తీసే జ‌గ‌న్ బ్రాండ్లని... అవి ఇవే. పాద‌యాత్రలో వెళుతుంటే కంటికి కానొచ్చాయి. పాపాల పెద్దిరెడ్డి ఇలాకా పుంగనూరులోనే బూమ్ బూమ్, బ్లాక్ బ‌స్టర్‌, మ‌ల‌బార్ హౌస్, మెలిస్సా... ఇవ‌న్నీ సారుగారి స‌రుకే. ప్రభుత్వ దుకాణాల పేరుతో న‌డిచే జె సిండికేట్ షాపుల‌కి జె బ్రాండ్స్ తీసుకెళ్తుంటే సెల్ఫీ కొట్టిన" అంటూ సెటైర్లు వేశారు.

*లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 437 కి.మీ.*

*ఇవాళ నడిచిన దూరం – 14.2 కి.మీ.*

యువగళం పాదయాత్ర 34వ రోజు షెడ్యూల్ (4-3-2023)

*పుంగనూరు నియోజకవర్గం*

ఉదయం

9.00 – కొక్కువారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.00 – దేవళంపేటలో స్థానికులతో మాటామంతీ.

10.35 – తుడుంవారిపల్లిలో బీసీ సామాజికవర్గీయులతో భేటీ.

11.30 - కల్లూరులో యువతీయువకులతో ముఖాముఖి.

మధ్యాహ్నం

12.30 – కల్లూరులో భోజన విరామం.

సాయంత్రం

2.30 – కల్లూరులో ముస్లింలతో సమావేశం.

3.30 – కల్లూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

3.35 – కల్లూరు సర్కిల్ లో హామాలీలతో మాటామంతీ.

6.00 – జ్యోతినగర్ విడిది కేంద్రంలో బస.

*******

More Telugu News