Danielle Wyatt: గాళ్‌ఫ్రెండ్‌తో ఇంగ్లిష్ మహిళా క్రికెటర్ డేనియల్ వాట్ నిశ్చితార్థం!

Female Cricketer Who Proposed Virat Kohli Once Got Engaged With Girl Friend
  • అప్పట్లో విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసిన డేనియల్ వాట్
  • నాలుగేళ్లుగా జార్జి హాడ్జ్‌తో రిలేషన్‌షిప్
  • ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేసిన డేనియల్
  • వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
ఇంగ్లిష్ జట్టు మహిళా క్రికెటర్ డేనియల్ వాట్ గుర్తుందా?.. అప్పట్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి సరదాగా ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచింది. క్రికెట్ ప్రపంచంలో ఆమె మరోమారు హెడ్ లైన్స్‌కి ఎక్కింది. అసాధారణ ప్రతిభతో అభిమానులను అలరించిన ఆమె తాజాగా పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఫుట్‌బాల్ ఏజెంట్ అయిన గాళ్‌ఫ్రెండ్ జార్జి హాడ్జ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. వీరిద్దరూ 2019 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 

నిశ్చితార్థం జరిగినట్టు పేర్కొంటూ నిన్న సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జార్జిని చుంబిస్తున్న ఫొటోను డేనియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అది చూసిన అభిమానులు, క్రికెటర్లు వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. టీమిండియా స్టార్లు హర్లీన్ డియోల్, వేదా కృష్ణమూర్తి తదితరులు కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. 

సీఏఏ బేస్ అనే ఫుట్‌బాల్ ఏజెన్సీకి జార్జి హాడ్జ్ హెడ్. ఇది ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్ల కెరియర్, వారి అభివృద్ధి, నిర్వహణకు అంకితమైన సంస్థ. డేనియల్, జార్జి ఇద్దరూ నాలుగేళ్లుగా రిలేషన్‌లో ఉంటూ లండన్‌లో నివసిస్తున్నారు. ఆల్‌రౌండర్ అయిన డేనియల్ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. మార్చి 2010లో ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. 

ఇప్పటి వరకు 99 వన్డేలు, 303 టీ20 మ్యాచ్‌లు ఆడింది. లీగ్ క్రికెట్‌లో సూపర్‌నోవా, మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహించింది. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేయడంతో భారత అభిమానులకు కూడా ఆమె చిరపరిచితురాలిగా మారింది.
Danielle Wyatt
Virat Kohli
England
Georgie Hodge

More Telugu News