Saithej: చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన జరగడం ఇదే మొదటిసారి: 'విరూపాక్ష' టీజర్ డైలాగ్

  • 'విరూపాక్ష'గా సాయితేజ్
  • ఆయన జోడీకట్టిన సంయుక్త మీనన్ 
  • విభిన్నమైన కంటెంట్ తో రూపొందిన సినిమా 
  • సంగీతాన్ని అందించిన అజనీశ్ లోక్ నాథ్
  • ఏప్రిల్ 21వ తేదీన ఐదు భాషల్లో విడుదల
Virupaksha Teaser Released

సాయితేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత చేసిన మొదటి సినిమానే 'విరూపాక్ష'. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళ్లిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా అలరించనుంది. 

ఈ సినిమా టీజర్ ను ముందుగా పవన్ కి చూపించారు. ఆయనకి టీజర్ బాగా నచ్చినట్టుగా వార్తలు రావడంతో, అభిమానుల్లో మరింతగా కుతూహలం పెరుగుతూ వచ్చింది. నిన్ననే రిలీజ్ కావలసిన ఈ టీజర్ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. కొంతసేపటి క్రితమే ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. 'చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దీని నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది' అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

హారర్ టచ్ తో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ కనిపిస్తోంది. అజనీశ్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని అనిపిస్తోంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఏప్రిల్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. చాలా గ్యాప్ తరువాత సాయితేజ్ చేసిన ఈ సినిమా, ఆయనకి తప్పకుండా హిట్ తెచ్చి పెట్టాలని అభిమానులు భావిస్తున్నారు.


More Telugu News