Nagaland: నాగాలాండ్ లో భారీ విజయం దిశగా బీజేపీ కూటమి!

BJP Led Alliance Set To Retain Nagaland
  • 39 సీట్లలో ముందంజలో ఉన్న బీజేపీ-ఎన్ డీపీపీ కూటమి
  • కేవలం ఒకే సీటులో ఎన్ పీఎఫ్ లీడ్
  • సున్నా చుట్టేసిన కాంగ్రెస్
  • రాష్ట్ర తొలి మహిళా ఎమ్మెల్యేగా హెకానీ జఖాలు రికార్డు

మూడు ఈశాన్య రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో గెలుపు ఖాయం కాగా, నాగాలాండ్ లోనూ బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. 

నాగాలాండ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. మొత్తం 60 స్థానాలుండగా.. 31 సీట్లు వస్తే మెజారిటీ సాధించినట్లే. బీజేపీ, దాని మిత్రపక్షం ఎన్ డీపీపీ (నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ) ప్రస్తుతం 39 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక్కడ బీజేపీ 20 సీట్లలో పోటీ చేయగా.. ఎన్ డీపీపీ 40 సీట్లలో బరిలో నిలిచింది. 

ఇక నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్ పీఎఫ్) పరిస్థితి ఘోరంగా ఉంది. కేవలం ఒకే సీటులో లీడ్ లో ఉంది. ఈ పార్టీ 2018 ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకోవడం గమనార్హం. అంటే 25 సీట్లు తగ్గిపోయాయి. 

2003 దాకా నాగాలాండ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి ఒక్కరు కూడా ఎన్నిక కాలేదు. ఈసారీ అదే జరిగేలా కనిపిస్తోంది. ఉదయం రెండు స్థానాల్లో లీడ్ లో ఉన్నట్లు కనిపించినా.. తర్వాత ‘సున్నా’కి పడిపోయింది. ఇక ఇతరులు 20 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 

నాగాలాండ్ లో ఈసారి 59 సీట్లకే ఎన్నికలు జరిగాయి. ఒకసీటు ఏకగ్రీవమైంది. జున్హెబోటో జిల్లాలోని అకులుటో నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కజెటో కినిమి మరోసారి ఎన్నికయ్యారు.

1963లో రాష్ట్రం ఏర్పాటయ్యాక.. 14 అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఇప్పటి దాకా ఒక్క మహిళ కూడా ఎన్నిక కాలేదు. అయితే, ఈ సారి నలుగురు మహిళలు బరిలో నిలిచారు. దిమాపూర్ - 3 నుంచి ఎన్ డీపీపీ అభ్యర్థిగా పోటీ చేసిన హెకానీ జఖాలు విజయం సాధించారు. నాగాలాండ్ లో శాసనసభకు ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

  • Loading...

More Telugu News