Adani: అదానీ గ్రూప్ - హిండెన్ బర్గ్ ఆరోపణలపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court orders probe into Adani Hindenburg report
  • హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సెబీకి ఆదేశాలు
  • నివేదిక సమర్పణకు రెండు నెలల గడువు
  • రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏఎం సప్రే నాయకత్వంలో కమిటీ ఏర్పాటు
అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ విడుదల చేసిన సంచలనాత్మక నివేదిక, ఆరోపణలపై.. దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అదానీ గ్రూపు సెక్యూరిటీ చట్టాన్ని ఉల్లంఘించిందా? లేదా రిలేటెడ్ పార్టీ లావాదేవీల సమాచారాన్ని వెల్లడించడంలో విఫలమైందా అన్న అంశాలను తేల్చాలని కోరింది. కనీస పబ్లిక్ వాటా కలిగి ఉండాలనే నిబంధనలను ఉల్లంఘించినదీ గుర్తించాలని ఆదేశించింది.  

రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. నిపుణుల కమిటీలో ఓపీ భట్, జేపీ దేవ్ దర్, కేవీ కామత్, నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ ను సభ్యులుగా సుప్రీంకోర్టు నియమించింది. అదానీ-హిండెన్ బర్గ్ ఎపిసోడ్ కు దారితీసిన అంశాలను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పరిశీలిస్తుంది. ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి నియంత్రణ సంస్థ వైపు ఏదైనా వైఫల్యం ఉందా? అన్నది కూడా కమిటీ తేల్చనుంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్యా చట్టబద్ధమైన, నియంత్రణపరమైన చర్యలను సూచించింది. 

అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలకు పాల్పడుతోందని, షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేస్తోందని హిండెన్ బర్గ్ ఆరోపణలు చేయడం గుర్తుండే ఉంటుంది. తీవ్ర ఆరోపణలు కావడంతో అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ విలువ సగానికి పైనే నష్టపోయింది. మొత్తానికి ఈ అంశంలో సుప్రీంకోర్టు కమిటీని నియమించడం అత్యంత ముఖ్యమైన పరిణామం కానుంది. కమిటీ నివేదికతో అదానీ గ్రూప్ పై ఉన్న సందేహాలకు సమాధానం లభిస్తుందని ఆశించొచ్చు. 
Adani
Hindenburg
report
allegations
Supreme Court
ordered
investigation
appointed commitee

More Telugu News