Nagaland: త్రిపురలో దూసుకుపోతున్న బీజేపీ

  • త్రిపురలో పూర్తి ఆధిక్యం దిశగా బీజేపీ 
  • నాగాలాండ్‌లో బోణీ కొట్టిన ఎన్‌డీపీపీ
  • నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్
BJP about win in Tripura

ఈశాన్య రాష్ట్రం త్రిపురలో బీజేపీ క్లీన్ స్వీప్ ఖాయంగా కనిపిస్తోంది. త్రిపుర సహా నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఈ మూడు రాష్ట్రాల్లో చెరో 60 సీట్ల చొప్పున మొత్తం 180 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం త్రిపురలో 30 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. వామపక్షాలు 15, టీఎంసీ 13, ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక్కడ మ్యాజిక్ మార్క్ 31 మాత్రమే. ఇక, మేఘాలయలో కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధికారం దిశగా అడుగులేస్తోంది. ఆ పార్టీ 21 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, కాంగ్రెస్ ఆరు, బీజేపీ 5, ఇతరులు 27 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 

నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ- బీజేపీ కూటమి ముందంజలో ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 37 స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉండగా, ఓ స్థానంలో విజయం సాధించింది. ఎన్‌పీఎఫ్ 3, కాంగ్రెస్ 2, ఇతరులు 18 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 

త్రిపుర, నాగాలాండ్‌‌లలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, మేఘాలయలో మాత్రం నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇప్పుడీ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

More Telugu News