UNO: కైలాసదేశాన్ని పరిగణనలోకి తీసుకోలేం: స్పష్టం చేసిన ఐక్యరాజ్య సమితి

UNO States that Kailasa Country cannot be considered
  • జెనీవాలో ఐరాస సమావేశాలు
  • హాజరైన కైలాస దేశ ప్రతినిధులు
  • వారు అందించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోబోమన్న ఐరాస
ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ప్రసంగించామంటూ జబ్బలు చరుచుకుంటున్న వివాదాస్పద గురువు నిత్యానంద కైలాస దేశ ప్రతినిధులకు ఐరాస షాకిచ్చింది. స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని తాము పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఐరాస సాధారణ సమావేశాల్లో ఎవరైనా పాల్గోవచ్చని, రాతపూర్వకంగా తమ అభిప్రాయం చెప్పొచ్చని పేర్కొంది. దీనివల్ల వేర్వేరు వ్యక్తుల వ్యక్తిగత, లేదంటే వివిధ సంఘాల ప్రతినిధుల అభిప్రాయం తెలుసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంది. ఐరాస చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి రూపొందించే ప్రణాళికల్లో వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందని, అంతమాత్రాన కైలాస దేశ ప్రతినిధులు వ్యక్తపరిచిన అభిప్రాయాలను యూఎన్ పరిగణనలోకి తీసుకోబోదని స్పష్టం చేసింది.

కాగా, ఫిబ్రవరి 24న జెనీవాలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ సుస్థిర అభివృద్ధి అనే అంశంపై బహిరంగ చర్చా వేదిక నిర్వహించింది. యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస ప్రతినిధుల పేరుతో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. వారిలో విజయప్రియ నిత్యానంద అనే మహిళ తనని తాను పరిచయం చేసుకుంటూ కైలాస దేశ ప్రతినిధిగా పేర్కొన్నారు.   

దీంతో ఐక్యరాజ్య సమితి కైలాస దేశాన్ని అధికారికంగా గుర్తించిందా? అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమైంది. దీనిపై తాజాగా ఐరాస స్పందించి వివరణ ఇచ్చింది. సమావేశాల్లో ఎవరైనా మాట్లాడొచ్చని, అంతమాత్రాన స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.
UNO
Kailasa Country
Nithyananda
Vijayapriya Nithyananda

More Telugu News