Nizamabad District: తనకు కాబోయే భార్యను ప్రేమిస్తున్నాడని కక్ష.. స్నేహితుడిని కడతేర్చిన యువకుడు!

Friend killed his friend for loving his girl friend
  • నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో ఘటన
  • తమ్ముడితో కలిసి స్నేహితుడిని అంతమొందించిన నిందితుడు
  • ఆ తర్వాత ప్రేమించిన యువతిని పెళ్లాడిన వైనం
  • ఐదు నెలల తర్వాత వెలుగులోకి హత్య
తాను ప్రేమించిన అమ్మాయిపై కన్నేసిన స్నేహితుడిని దారుణంగా చంపేశాడో యువకుడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రానగర్ పంచాయతీ పరిధిలో నివాసముండే కార్తీక్ (22), బాపట్ల రాజు (22) స్నేహితులు. ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో రాజు ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే యువతిని అతడి స్నేహితుడైన కార్తీక్ కూడా ప్రేమించాడు. విషయం తెలిసిన రాజు అతడిపై కక్ష పెంచుకుని అంతమొందించాలని తమ్ముడు బొజ్జ హరీశ్‌తో కలిసి పథకం పన్నాడు. 

అందులో భాగంగా గతేడాది సెప్టెంబరు 20న నందిపేట శివారులోని ఎల్లమ్మగుడి వద్దకు కార్తీక్‌ను తీసుకెళ్లి మద్యం తాగించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న విజయనగరం గుట్ట వద్దకు తీసుకెళ్లి తలపై కర్రతో బాది హత్య చేసి మృతదేహాన్ని అక్కడి బండరాళ్ల మధ్య పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాజు తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నాడు. 

మరోవైపు, నెలలు గడుస్తున్నా కుమారుడు ఇంటికి రాకపోవడంతో పని కోసం ఆంధ్రప్రదేశ్ వెళ్లి ఉంటాడని కార్తీక్ తల్లి భావించింది. అయినప్పటికీ కుమారుడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పెద్ద కుమారుడి సాయంతో ఇరుగుపొరుగు వద్ద ఆరా తీసింది. ఈ క్రమంలో కార్తీక్ హత్య వెలుగు చూసింది. 

వారి పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయనగరం గుట్ట ప్రాంతంలో పరిశీలించగా అస్థిపంజరం కనిపించింది. అక్కడే దానికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా అది కార్తీక్‌దేనని తేలింది. హత్య వెలుగులోకి రాగానే నిందితులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Nizamabad District
Nandipat Mandal
Love Affair
Crime News

More Telugu News