Ragi: మిల్లెట్స్ అందరికీ అన్నీ కాదు..!

  • రాగి, బజ్రా వేడి కారకాలు
  • వేసవి కాకుండా మిగిలిన కాలాల్లో అనుకూలం
  • ఒకేసారి రైస్ మానేసి మిల్లెట్స్ కు మారిపోకుండా క్రమంగా చేయాలి
Ragi Jowar Bajra Dos And Donts Of Eating Millets

సాధారణ వైట్ రైస్ తో పోలిస్తే మిల్లెట్స్ (సిరి ధాన్యాలు) చాలా మంచివి. మిల్లెట్స్ లో పోషకాలు మెండుగా ఉంటాయి. ప్రొటీన్, ఫైబర్, బీ విటమిన్లు, మినరల్స్ ఇవన్నీ కూడా మిల్లెట్స్ నుంచి లభిస్తాయి. పైగా గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ అన్నది గోధుమ, బార్లీలో ఉండే ప్రొటీన్. గ్లూటెన్ లేని ఆహారం మంచిది. 


2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్ గా నిర్వహిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ మిల్లెట్స్ ను తమ ఆహారంలో భాగం చేసుకోవడం అవసరం. అయితే, మిల్లెట్స్ అన్నీ అందరికీ సరిపడతాయనేమీ లేదు. కొందరికి కొన్ని అజీర్ణంగా అనిపించొచ్చు. వేడి చేయవచ్చు. కనుక తమ శరీర తత్వానికి అనుకూలంగా ఉన్నవి, తీసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది పెట్టని మిల్లెట్స్ ను వాడుకోవడం మంచిది. 

రాగి
రాగి వేడి చేసే పదార్థం. శీతాకాలంలో దీన్ని తీసుకోవడం అనుకూలం. రాగిలో క్యాల్షియం, ప్రొటీన్, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. రాగి జావగాను లేదా సంకటిగా తీసుకోవచ్చు. మిల్లెట్స్ అన్నింటిలోకీ రాగి తేలికైనది. కనుక దీనితో ప్రారంభించి, తర్వాత నెమ్మదిగా ఇతర సిరిధాన్యాలను ప్రయత్నించి చూడొచ్చు.

జొన్న
జొన్న పిండిని ఏడాదంతా తీసుకోవచ్చు. ప్రొటీన్, ఐరన్, ఫైబర్ ఇందులో తగినంత లభిస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గోధుమ పిండి స్థానంలో జొన్న పిండి వాడుకోవడం చాలా రకాలుగా మంచిది. బరువు తగ్గాలని అనుకునే వారికి మంచి ఆప్షన్. రక్తంలో షుగర్ ను సైతం నియంత్రణలో ఉంచుతుంది. 

బజ్రా
రాగి మాదిరే బజ్రా కూడా వేడి కారకమే. దీన్ని వేసవిలో కాకుండా మిగిలిన కాలాల్లో తీసుకోవచ్చు. మజ్జిగతో కలిపి వేసవిలో కూడా తీసుకోవచ్చు. దీంతో బరువు తగ్గొచ్చు. శిరోజాలు, చర్మ ఆరోగ్యానికి మేలు చేసేవి ఇందులో ఉన్నాయి.

ఇవి గుర్తు పెట్టుకోవాలి
మిల్లెట్స్ కు మారే వారు కొద్ది కొద్దిగా తీసుకోవాలే కానీ, ఒకేసారి రైస్ ఆపేసి మిల్లెట్స్ తీసుకోవడం చేయకూడదు. ఎందుకంటే మిల్లెట్స్ జీర్ణపరంగా కఠినమైనవి. ఫైబర్ ఉండడం వల్ల రైస్ మాదిరి వేగంగా జీర్ణం కావు. అలాగే, కనీసం 8 గంటల పాటు అయినా మిల్లెట్స్ ను నీళ్లలో నానబెట్టాలి. మొలకెత్తించి వాడుకుంటే ఇంకా మంచిది. లేదంటే వీటిల్లో ఉండే ఫైటిక్ యాసిడ్ మన శరీరం పోషకాలు గ్రహించకుండా అడ్డుకుంటుంది. హైపో థైరాయిడిజం సమస్యతో బాధపడే వారు మిల్లెట్స్ తీసుకోకుండా ఉండడమే మంచిది.

More Telugu News