Bopparaju Venkateswarlu: ఏపీ సీఎస్ ను కలిసి ఉద్యమ నోటీసులు ఇచ్చిన ఉద్యోగ సంఘం నేతలు

APJAC Amaravati Employees Association leaders met AP CS
  • డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఉద్యమ బాట
  • మార్చి 9 నుంచి ఉద్యమ కార్యాచరణ
  • ఉద్యోగులంతా డిమాండ్ల సాధనకు ఉద్యమించాలన్న బొప్పరాజు
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం ఉద్యమ కార్యాచరణను ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలు ఇవాళ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. ఆయనకు తమ ఉద్యమ కార్యాచరణ నోటీసులు అందజేశారు. 

ఉద్యోగుల ఆర్థికపరమైన, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యమం చేపడుతున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. మార్చి 9 నుంచి ఉద్యమ కార్యాచరణ షురూ అవుతుందని వెల్లడించారు. 

ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధనకు ఆందోళన బాటపట్టాలని పిలుపునిచ్చారు. ముందుగా సెల్ డౌన్, పెన్ డౌన్, భోజన విరామ నిరసనలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆ తర్వాత కలెక్టరేట్లలో స్పందన దరఖాస్తులు ఇస్తామని వెల్లడించారు. 

అప్పటికీ తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈసారి చాయ్ బిస్కట్ సమావేశాలతో రాజీపడే ప్రసక్తేలేదని తమ వైఖరిని వెల్లడించారు.
Bopparaju Venkateswarlu
APJAC Amaravati
Employees
Notice
CS
Andhra Pradesh

More Telugu News