Rohit Sharma: కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ గా తొలగించడంపై రోహిత్ శర్మ వ్యాఖ్యలు

  • ఇటీవల ఘోరంగా ఆడుతున్న కేఎల్ రాహుల్
  • ఆసీస్ తో తొలి రెండు టెస్టుల్లోనూ విఫలం
  • వైస్ కెప్టెన్ గా తొలగింపు
  • ఇదేమంత ప్రాధాన్య అంశం కాదన్న రోహిత్ శర్మ
Rohit Sharma talks about KL Rahul issue

కెరీర్ లోనే అత్యంత చెత్తగా ఆడుతున్న కేఎల్ రాహుల్ ను టీమిండియా వైస్ కెప్టెన్ గా తొలగించడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. వైస్ కెప్టెన్ పదవి నుంచి రాహుల్ ను తప్పించడంలో ప్రత్యేకత ఏమీ లేదని, దానికి ఎలాంటి అర్థాలు వెతకాల్సిన అవసరంలేదని స్పష్టం చేశాడు. సత్తా ఉన్న ఆటగాళ్లకు టీమిండియా మేనేజ్ మెంట్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నాడు. 

ఇటీవల కేఎల్ రాహుల్ వరుసగా విఫలమవుతుండడంతో జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకమైంది. అయితే ఆసీస్ తో తొలి రెండు టెస్టులకు రాహుల్ కు అవకాశం ఇచ్చినా ఘోరంగా విఫలమయ్యాడు. అదే సమయంలో యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉండగా, అతడ్ని పక్కనబెట్టి మరీ కేఎల్ రాహుల్ ను ఆడిస్తుండడంపై టీమిండియా వ్యూహకర్తలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. 

దానికితోడు నిన్న నెట్ ప్రాక్టీసులో కేఎల్ రాహుల్, శుభ్ మాన్ గిల్ ఇద్దరూ చెమటోడ్చి సాధన చేశారు. దాంతో మూడో టెస్టుకు రోహిత్ శర్మకు జోడీ ఇన్నింగ్స్ ను ఎవరు ప్రారంభిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు రోహిత్ శర్మ వ్యాఖ్యలు చూస్తుంటే, రాహుల్ మూడో టెస్టులోనూ ఆడతాడని తెలుస్తోంది. 

"గత రెండు టెస్టు మ్యాచ్ లు ముగిసిన సమయంలోనూ నేను దీని గురించి మాట్లాడాను. ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి మరింత సమయం ఇవ్వడం జరుగుతుంది. వారు నిరూపించుకోవడానికి అవకాశాలు ఇస్తాం. ఇక వైస్ కెప్టెన్ పదవిలో ఉన్నా, పదవి కోల్పోయినా దానికంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు" అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

అంతేకాదు, నెట్స్ లో కేఎల్ రాహుల్, శుభ్ మాన్ గిల్ ఇద్దరూ ప్రాక్టీసు చేస్తుండడంపైనా వివరణ ఇచ్చాడు. చివరి నిమిషం వరకు తుది 11 మందిలో ఏవైనా మార్పులు జరగొచ్చని, ఎవరైనా గాయపడితే వారి బదులు మరొకరు జట్టులోకి వస్తారని తెలివిగా సమాధానమిచ్చాడు. టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టు రేపటి నుంచి ఇండోర్ లో జరగనుంది.

More Telugu News