kidneys: ఈ సంకేతాలు కనిపిస్తే.. కిడ్నీ సమస్యలు మొదలైనట్టే!

Signals in your body that indicate your kidney is in trouble
  • ముఖం, పాదాలు, కళ్ల చుట్టూ వాపులు కనిపిస్తే కిడ్నీ సమస్యలకు సంకేతాలే
  • తీవ్ర అలసట, మూత్ర విసర్జనలో సమస్యలు
  • దురదలు, పొడిచర్మం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే వైద్యులను కలవాలి
మన శరీరంలో ప్రతీ అవయవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా మనం ప్రాణాలతో జీవించి ఉండాలంటే కొన్ని అవయవాలు తప్పనిసరిగా పనిచేస్తూ ఉండాలి. అలాంటి వాటిల్లో మూత్ర పిండాలు (కిడ్నీలు) ఒకటి. మెదడు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయం కూడా ఎంతో కీలకమైనవి. 

మూత్ర పిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. హానికారకాలు, వ్యర్థాలను తొలగించి వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంటాయి. ఈ ప్రక్రియ నిరంతరం సాగిపోవాల్సిందే. మూత్ర పిండాలు సమస్యల బారిన పడుతుంటే తప్పకుండా బయటకు తెలుస్తుంది. ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

వాపు
ముఖం, పాదాలు, కళ్ల చుట్టూ వాపులు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ద చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లాలి. రక్తంలో వ్యర్థాలను బయటకు పంపించడం కిడ్నీల ముఖ్యమైన విధి. కానీ, కిడ్నీ పనితీరు సరిగ్గా లేనప్పుడు ఈ శుద్ధి ప్రక్రియపై ప్రభావం పడుతుంది. దీంతో వ్యర్థాలు పూర్తిగా బయటకు వెళ్లకుండా శరీరంలో చేరిపోతాయి. దీనికి తోడు నీరు, ఉప్పు కూడా పెరిగిపోతాయి. ఇవన్నీ వాపు కిందకు దారితీస్తాయి. 

తీవ్ర అలసట
మూత్ర పిండాలు ముఖ్యమైన ఎరిత్రోప్రొటీన్ అనే హార్మోన్ ను తయారు చేస్తాయి. ఎర్ర రక్తకణాలను తయారు చేయాలని శరీరానికి సంకేతాలు ఇచ్చేది ఇదే హార్మోన్. మరి ఈ హార్మోన్ లోపించినా, ఇది సంకేతాలు ఇచ్చే ప్రక్రియకు విఘాతం కలిగినా అది అనీమియాకు దారితీస్తుంది. మెదడు, కండరాలకు ఆక్సిజన్, పోషకాల సరఫరాకు విఘాతం కలుగుతుంది. దీంతో తీవ్ర అలసట వస్తుంది.

మూత్ర విసర్జన
మూత్ర విసర్జన ప్రక్రియ సజావుగా ఉండదు. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు మూత్ర విసర్జన ప్రక్రియ గాడి తప్పుతుంది. కొందరికి తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తే, మూత్రంలో రక్తాన్ని కొందరు గుర్తించొచ్చు. మూత్ర విసర్జన చేసినప్పుడు బబుల్స్, నురగ వస్తుంటే తప్పకుండా వైద్యులను కలవాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
మన శరీరంలో ఫ్లూయిడ్స్ ను సరైన క్రమంలో ఉంచడంలో కిడ్నీలది ముఖ్య పాత్ర. మరి కిడ్నీల పనితీరు సరిగ్గా లేనప్పుడు ఫ్లూయిడ్స్ పెరిగిపోయి, దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. కొందరిలో ఛాతీనొప్పి కూడా అనిపిస్తుంది.

పొడిచర్మం, దురదలు
చర్మం పొడిబారిపోవడం, దురదలు వస్తుంటే కిడ్ని సమస్యలుగా అనుమానించొచ్చు. రక్తంలో మినరల్స్, న్యూట్రియెంట్స్ సమతుల్యత తప్పిందనడానికి నిదర్శనం. రక్తంలో ఫాస్ఫరస్ పెరిగినా ఇదే పరిస్థితి తలెత్తుతుంది.

కిడ్నీ ఆరోగ్యం కోసం
శారీరక వ్యాయామం తప్పకుండా ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. అధికంగా ఉన్న బరువు తగ్గాలి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. మద్యపానం, పొగతాగడం మానేయాలి. అధిక రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి.
kidneys
function
Signals
trouble
problems

More Telugu News