Zircon: 410 కోట్ల సంవత్సరాల నాటి అత్యంత అరుదైన శిలలు తెలంగాణలో లభ్యం

  • హైదరాబాదుకు 100 కిమీ దూరంలో జిర్కోన్ శిలలు గుర్తింపు
  • భూమి ఏర్పడిన తొలినాళ్లవని భావిస్తున్న పరిశోధకులు
  • భూమి ఆవిర్భావం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం
410 crores aged Zircon samples found in Telangana

ఎలాంటి వాతావరణంలోనైనా చెక్కుచెదరని ఖనిజ లవణం జిర్కోన్ కు సంబంధించిన ఆనవాళ్లు తెలంగాణలో బయల్పడ్డాయి. తెలంగాణలోని చిత్రియాల్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో కొన్ని అత్యంత అరుదైన శిలలను వెలికితీశారు. ఇవి 410 కోట్ల సంవత్సరాల నాటివని గుర్తించారు. ఆ శిలల వయసు రీత్యా భూమి ఏర్పడిన తొలినాళ్ల నాటివని భావిస్తున్నారు. 

కోల్ కతాకు చెందిన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ స్టడీస్ (ఎన్సీఈఎస్ఎస్), జపాన్ కు చెందిన హిరోషిమా యూనివర్సిటీ పరిశోధకులు ఈ అత్యంత అరుదైన శిలల ఆవిష్కరణలో పాలుపంచుకున్నారు. భూమి తొలినాళ్లలో రసాయనిక పరిణామ క్రమం ఎలా ఉండేదన్న అంశాన్ని తెలుసుకునేందుకు ఈ శిలలు ఉపకరించనున్నాయి. 

భూమి ఏర్పడిన తొలి 50 కోట్ల సంవత్సరాల్లో వాతావరణం, భూమి స్థితిగతులు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ గుట్టు విప్పే అవకాశం శాస్త్రవేత్తల ముందు నిలిచింది. ఈ శిలల ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలు ఇటీవలే ప్రికేంబ్రియన్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. 

అత్యంత తీవ్ర ఉష్ణోగ్రత కారణంగా కరిగిన మాగ్మా పదార్థం భూమి పైభాగంలో గట్టిపడినప్పుడు స్ఫటికీకరణ చెందిన మొట్టమొదటి ఖనిజలవణాల్లో జిర్కోన్ ఒకటి. ఇది ఎంతో కఠినమైన ఖనిజ లవణం... రసాయనికంగా స్థిరమైనది. అందుకే వాతావరణ పరిస్థితులు కూడా దీన్ని ఏమీ చేయలేవు. దీనిపై విస్తృత పరిశోధనలు చేయడం ద్వారా భూమి ఆవిర్భావానికి సంబంధించిన కొత్త సిద్ధాంతాలకు ద్వారాలు తెరవనున్నారు.

More Telugu News