Chandrababu: వివేకా హత్య కేసులో సజ్జల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన

Chandrababu reacts on Sajjala remarks in Viveka murder issue
  • వివేకా హత్య కేసులో మరోసారి సీబీఐ ముందుకు అవినాశ్
  • అవినాశ్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదన్న సజ్జల
  • సాక్షి గుమస్తా అంటూ సజ్జలపై చంద్రబాబు విమర్శలు
  • సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏలూరులో టీడీపీ జోన్-2 సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వివేకా హత్యోదంతంపై స్పందించారు. వివేకాను చంపిన 6 గంటల తర్వాత సాక్షి మీడియాలో గుండెపోటుతో చనిపోయినట్టు వార్తలు వచ్చాయని, దాంతో తాము కూడా అది నిజమే అనుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. 

అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది తానే అని, ఆ వార్తలు చూసి తాను కూడా మోసపోయానని తెలిపారు. అందరూ కూడా వివేకా గుండెపోటుతోనే చనిపోయారని అనుకున్నారని వెల్లడించారు. అయితే వివేకా కుమార్తె సునీత మాత్రం తన తండ్రి ఎలా చనిపోయాడో కారణం తెలుసుకోవాలంటూ పోస్టుమార్టంకు పట్టుబట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు. 

"అక్కడ్నించి తీగ లాగితే డొంకంతా బయటపడింది. మనిషిని అంత భయంకరంగా చంపేశారు. రెండు లీటర్ల రక్తం ఎక్కడ చూసినా కనిపిస్తుంటే, గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. గోడ తలకు కొట్టుకోవడంతో రక్తం వచ్చిందని చెప్పారు. 

ఎప్పుడైతే పోస్టుమార్టం రిపోర్టు వచ్చిందో... అప్పటివరకు ఓపెన్ గా మాట్లాడినవాళ్లు ప్లేటు ఫిరాయించారు. గతంలో నా తండ్రి చనిపోయాడు... ఇప్పుడు నా బాబాయిని చంపేశారు అని ఆరోపించాడు. ఆ తర్వాత రోజే సిగ్గూఎగ్గూ లేకుండా తన పేపర్లో నారాసుర రక్తచరిత్ర అని రాశాడు. తన చెల్లెలు సునీతను కూడా ట్రాప్ చేశాడు. సీబీఐ ఎంక్వైరీ అంటూ డ్రామాలు ఆడి రాష్ట్రమంతా సానుభూతి సంపాదించాడు. 

మన ప్రజలకు సానుభూతి ఎక్కువ. దొంగలకంటే భయంకరమైన జగన్ ఆ విధంగా ప్రజలను మోసం చేశాడు. ఆ తర్వాత అధికారంలోకి వస్తూనే సీబీఐ విచారణ వద్దన్నది కూడా ఇతనే. ఆ తర్వాత సునీత సీబీఐ విచారణకు పట్టుబట్టి, పట్టువదలని రీతిలో సుప్రీంవరకు వెళ్లి కేసు విచారణ పక్క రాష్ట్రానికి బదిలీ చేయించింది. 

సాక్షి గుమస్తా సజ్జల ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాడు. అతడు ఏదైనా మాట్లాడగలడు... సీబీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేనే మేనేజ్ చేస్తున్నానంట! ఏది పడితే అది వాగుతుంటారు. వాళ్లు వాగిన తర్వాత వాళ్ల కార్యకర్తలు కొందరు సైకోలు ఉంటారు... వాళ్లు పట్టుకుంటారు దాన్ని. అక్కడ్నించి సోషల్ మీడియాలో పేటీఎమ్ బ్యాచ్ తగులుకుంటారు.

ఇక్కడ ఓ బ్లూ మీడియా ఉంది. ఆ టీవీ9, ఎన్ టీవీ వీటి గురించి ఒక్క వార్త రాయరు. మనమేం చేయకపోయినా దాన్నొక పెద్ద న్యూస్ చేస్తారు. జగన్ కు మీడియానే లేదంట... సాక్షి ఆయనది కాదంట, ఎన్టీవీ ఆయనది కాదంట, లేకపోతే టీవీ9 ఆయనది కాదంట! 

వాళ్లే మళ్లీ అందరిపై విచారణ చేయలంటున్నాడు. మా అవినాశ్ కు ఈ కేసులో ఏమాత్రం సంబంధం లేదు... అవినాశ్ రెడ్డి నోట్లో వేలు పెడితే కొరకలేడు అని అంటున్నాడు. ఓవైపు సీబీఐ విచారణ జరుగుతోంది... కానీ ప్రభుత్వ సలహాదారు సిగ్గు కూడా లేకుండా సీబీఐదే తప్పు అంటున్నాడు, తాము నిర్దోషులం అని చెప్పుకుంటున్నాడు. 

ఎవరెవరు ఎప్పుడు కలిశారు... అన్నీ గూగుల్ టేక్ ఔట్ లో బయటికి వచ్చాయి. అవినాశ్ ఇంట్లో అందరూ కూర్చుని చర్చించడం, హత్య చేసిన తర్వాత మళ్లీ అతడి ఇంటికి రావడం, అక్కడ్నించి లోటస్ పాండ్ లో జగన్ కు, భారతికి ఫోన్లు చేయడం, ఆ తర్వాత గుండెపోటు అని చెప్పడం జరిగాయి. ఈ హత్యకు రూ.40 కోట్ల సుపారీ ఇచ్చారు.... రూ.40 కోట్లు అవినాశ్ దగ్గర ఉన్నాయా? ఎవరి డబ్బులు ఇవి?

ఎంపీ స్థానాన్ని షర్మిలకు ఇవ్వాలని, అవినాశ్ కు జమ్మలమడుగు సీటు ఇవ్వాలని వివేకా చెప్పడంతో, అతడిని అడ్డు తొలగించుకోవడానికి చేసిన హత్య ఇది. అంతఃపుర హత్య ఇది. బాబాయ్ ని చంపి ఇంత డ్రామాలు ఆడారంటే, మనందరం కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయం స్పష్టమవుతుంది" అని చంద్రబాబు వివరించారు. 

ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అధికారంలోకి వస్తామని, వస్తున్నామని, ఇందులో తమకు ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. నాడు రామరావణాసుర యుద్ధం ఎలా జరిగిందో, రేపు అలాంటి యుద్ధమే జరగనుందని, తన బలం, సైన్యం టీడీపీ కార్యకర్తలేనని చంద్రబాబు ఉద్ఘాటించారు.
Chandrababu
Sajjala Ramakrishna Reddy
YS Vivekananda Reddy
Avinash Reddy
TDP
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News