Air India flight emergency landing: తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • కేరళలోని కోజికోడ్ నుంచి సౌదీలోని డమ్మమ్ కు బయల్దేరిన ఎయిరిండియా విమానం
  • టేకాఫ్ తీసుకుంటుండగా రన్ వేను ఢీకొన్న తోక భాగం
  • సేఫ్ ల్యాండింగ్ కోసం అరేబియా సముద్రంలో విమానం ఇంధనం పారబోత 
  • వారంలో రెండోసారి ఎయిరిండియా ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India flight to Dammam makes emergency landing in Thiruvananthapuram

ఎయిరిండియా విమానం సాంకేతిక కారణాలతో కేరళలోని తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. టేకాఫ్ సమయంలో రన్ వేను విమానం తోక భాగం ఢీకొనడంతో రెండు గంటల తర్వాత కిందికి దించేశారు. ఆ సమయంలో విమానంలో 168 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.

కోజికోడ్ లోని కారిపూర్ ఎయిర్ పోర్ట్ నుంచి సౌదీలోని డమ్మమ్ కు ఈ రోజు ఉదయం గం. 9.44కి విమానం టేకాఫ్ అయింది. రెండు గంటలు ప్రయాణించిన తర్వాత తిరువనంతపురంలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. ‘‘168 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం తోక భాగం.. టేకాఫ్ సమయంలో రన్ వేని ఢీకొంది. దీంతో సేఫ్ ల్యాండింగ్ కోసం ముందు జాగ్రత్తగా అరేబియా సముద్రంలో ఇంధనాన్ని పారబోసింది. తర్వాత మధ్యాహ్నం గం. 12.15కు తిరువనంతపురంలో సురక్షితంగా కిందికి దిగింది’’ అని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటన నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ లో పూర్తిగా ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానం నుంచి ప్రయాణికులను దించేశారు. ‘‘ప్రయాణికులను డమ్మన్ కు పంపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. మధ్యాహ్నం గం. 3.30 తర్వాత ఇంకో విమానంలో వారిని పంపిస్తున్నాం. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మా సిబ్బంది చూసుకుంటున్నారు’’ అని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది.

ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడం వారంలో ఇది రెండో సారి. బుధవారం 300 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం.. ఓ ఇంజిన్ లో ఆయిల్ లీక్ అవుతుండటంతో స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది.

More Telugu News