కొండగట్టు అంజన్న గుడిలో దొంగతనం
- 9 లక్షల విలువైన వెండి వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు
- గురువారం అర్ధరాత్రి దాటాక వెనక వైపు నుంచి ఆలయంలోకి చొరబాటు
- గుడి మూసేసి విచారణ జరుపుతున్న అధికారులు
అంజన్న ఆలయంలో రోజులాగే గురువారం కూడా స్వామి వారి నిత్యసేవలు ముగిసిన తరువాత అధికారులు ప్రధాన ద్వారానికి తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటాక ముగ్గురు దొంగలు ఆలయం వెనక ద్వారాన్ని తెరిచి లోపలకు చొరబడ్డారు. ఆలయంలోని స్వామివారి 2 కిలోల వెండి మకర తోరణం, అర్ధమండపంలోని 5 కిలోల ఆంజనేయస్వామి వెండి ఫ్రేమ్, 3 కిలోల నాలుగు వెండి శఠగోపాలు, స్వామివారి 5 కిలోల వెండి తొడుగు తదితర వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
ఈ ఆభరణాలు దాదాపు 15 కిలోల వరకు ఉంటాయని, వీటి విలువ సుమారు. 9 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆలయంలో దొంగతనం జరిగిన నేపథ్యంలో పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించడంలేదు. చోరీ చేసిన వారు స్థానికులా లేక వేరే ప్రాంతం నుంచి వచ్చారా? అనేది తేల్చే పనిలో పడ్డారు.