IPS officer: రూ.కోటి చెల్లించాలి.. క్షమాపణ చెప్పాలి: కర్ణాటక ఐఏఎస్ అధికారిణి డిమాండ్

  • ఐపీఎస్ అధికారి రూప మౌద్గిల్ కు రోహిణి సింధూరి నోటీసులు
  • మానసిక వేదనకు గురి చేసినట్టు, ప్రతిష్టకు నష్టం వాటిల్లినట్టు ఆరోపణలు
  • రోహిణి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చిన రూప మౌద్గిల్
Amid bitter tussle over pics IAS officer Rohini seeks Rs 1 cr compensation unconditional apology from IPS officer Roopa

కర్ణాటకలో ఇద్దరు ఉన్నతాధికారిణుల మధ్య ఏర్పడిన వివాదం మరింత ముదిరింది. ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి సీనియర్ ఐఏఎస్ అధికారులకు తన వ్యక్తిగత ఫొటోలను (అవాంఛిత) పంపినట్టు ఐపీఎస్ అధికారి అయిన రూప మౌద్గిల్ ఆరోపించడం తెలిసిందే. దీంతో రూపపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని రోహిణి ఇప్పటికే కోరారు. తాజాగా తనపై చేసిన వ్యాఖ్యలకు గాను నష్టపరిహారం కింద రూ.కోటి చెల్లించాలని, క్షమాపణ చెప్పాలంటూ రూప మౌద్గిల్ కు రోహిణి సింధూరి లీగల్ నోటీసులు పంపించారు. 

ప్రతిష్టకు జరిగిన నష్టం, మానసిక వేదనకు గాను ఈ మొత్తం చెల్లించాలని రోహిణి డిమాండ్ చేశారు. ఫేస్ బుక్ లో రోహిణికి వ్యతిరేకంగా రూప మౌద్గిల్ పోస్ట్ పెట్టడం, అవినీతి సహా 19 ఆరోపణలు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. తన షరతులను అమలు చేయకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని రోహిణి సింధూరి హెచ్చరించారు. తన ఫొటోలను సీనియర్ ఐఏఎస్ అధికారులకు పంపించడం ద్వారా సర్వీస్ నిబంధనలను రోహిణి ఉల్లంఘించారన్నది రూప మౌద్గిల్ ఆరోపణగా ఉంది. 

‘‘మీరు చేసిన వ్యాఖ్యలు/ప్రకటనలు/ఆరోపణలు నా క్లయింట్, ఆమె కుటుంబ సభ్యులను ఎంతో మానసిక వేదనకు గురి చేశాయి. వృత్తి పరంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా ఆమె ప్రతిష్టను దెబ్బతీశాయి. వీటి కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆమె నిజాయితీ, ప్రవర్తన చర్చనీయాంశంగా మారాయి. నా క్లయింట్ పేరు, ప్రతిష్టలకు జరిగిన నష్టాన్ని కరెన్సీ రూపంలో కొలవలేము. అయినప్పటికీ దీన్ని కోటి రూపాయలకు పరిమితం చేస్తున్నాం. నష్ట పరిహారం కింద ఈ మొత్తాన్ని మీరు నా క్లయింట్ కు చెల్లించాలి’’ అని రూప మౌద్గిల్ కు పంపిన నోటీసులో పేర్కొన్నారు. 

అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని, రోహిణి సింధూరి అవినీతిపై మీడియా దృష్టి సారించాలంటూ రూప మౌద్గిల్ పిలుపునివ్వడం గమనార్హం. అంతేకాదు తీవ్ర పదజాలంతో కూడిన పెద్ద పోస్ట్ ను ఫేస్ బుక్ లో పెట్టారు. వీరి ఆరోపణలతో సీఎం బస్వరాజ్ బొమ్మై జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఈ నెల 21న వీరిద్దరినీ ఏ పోస్ట్ కేటాయించకుండా కర్ణాటక సర్కారు బదిలీ చేయడం గమనార్హం.

More Telugu News