Kerala: 16 నెలల చిన్నారి చికిత్సకు రూ. 17.5 కోట్లు అవసరం.. గుప్తదానంగా రూ. 11 కోట్లు ఇచ్చిన వ్యక్తి!

  • నౌకాదళ అధికారి దంపతులకు 16 నెలల కుమారుడు 
  • స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్-2తో బాధపడుతున్న చిన్నారి
  • చికిత్సకు రూ. 17.5 కోట్లు ఖర్చవుతుందన్న వైద్యులు
  • మరో రూ.80 లక్షలు సమకూరితే చికిత్సకు అవసరమైన డబ్బులు వచ్చినట్టే
US based keralite donates Rs 11 cr for treatment of Kerala toddler

అత్యంత అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్-2తో బాధపడుతున్న 16 నెలల చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ఓ వ్యక్తి చూపిన ఔదార్యం అందరినీ కట్టిపడేస్తోంది. ఎవరూ ఊహించనంత డబ్బును ఆయన తన పేరు చెప్పకుండా విరాళంగా ఇచ్చారు. 

కేరళలోని ఎర్నాకుళానికి చెందిన నౌకాదళ అధికారి సారంగ్ మీనన్, అతిథి నాయర్ దంపతులకు 16 నెలల క్రితం నిర్వాణ్ అనే కుమారుడు జన్మించాడు. పుట్టిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు నిర్వాణ్ కాళ్లు కూడా కదపకపోవడంతో అనుమానించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా చిన్నారి అత్యంత అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్-2తో బాధపడుతున్నట్టు గుర్తించారు.

ఈ వ్యాధి సోకిన వారికి రెండేళ్లు నిండకుండానే చికిత్స అందించాల్సి ఉంటుంది. చికిత్సకు అయ్యే ఔషధాలను అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం దాదాపు రూ. 17.5 కోట్లు ఖర్చవుతుంది. అంత సొమ్మును భరించలేని సారంగ్-అతిథి దంపతులు ఆర్థిక సాయం కోసం ఆన్‌లైన్‌లో అభ్యర్థించారు. 

ఈ క్రమంలో నిర్వాణ్‌ను ఆదుకునేందుకు పలువురు ముందుకొచ్చి విరాళాలు జమ చేశారు. అమెరికాలో ఉంటున్న కేరళ వ్యక్తి ఒకరు తన పేరు చెప్పకుండా ఏకంగా రూ. 11 కోట్లు జమ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సొమ్ముతో వారి ఆర్థిక కష్టాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు అయింది. మరో రూ.80 లక్షలు సమకూరితే నిర్వాణ్ చికిత్సకు అవసరమైన డబ్బులు సమకూరినట్టు అవుతుంది.

More Telugu News