Adani Group: 100 బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి అదానీ గ్రూప్ అవుట్

  • గరిష్ఠాల నుంచి 136 బిలియన్ డాలర్ల నష్టం
  • నంబర్ 3 స్థానం నుంచి 26కు పడిపోయిన గౌతమ్ అదానీ
  • అదానీ గ్రూప్ నష్టపోయిన మొత్తం అంగోలా దేశ వార్షిక జీడీపీకి సమానం
Adani Group market value slips under 100 billion dollars

నెల క్రితం ప్రపంచ కుబేరుల్లో గౌతమ్ అదానీ స్థానం నంబర్ 3. కానీ, 47 బిలియన్ డాలర్ల సంపదతో నేడు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో అదానీ స్థానం 26. ఆయన సంపద విలువ 47 బిలియన్ డాలర్లుగా ఉంది. జనవరి 24 నుంచి చూస్తే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 136 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. మంగళవారం అదానీ గ్రూప్ పరిధిలోని 10 కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల దిగువకు వచ్చేసింది. రియల్ టైమ్ బిలియనీర్లు అంటే.. ఏ రోజుకారోజు మారిపోయే స్టాక్ వ్యాల్యూయేషన్ ఆధారంగా నిర్ణయిస్తారు.

అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ అదానీ గ్రూప్ ఖాతాలు, షేరు ధరల్లో అవకతవకలు ఉన్నాయంటూ ఓ నివేదికను జనవరి చివర్లో బయట పెట్టడం తెలిసిందే. నివేదికలోని తీవ్రమైన ఆరోపణలతో ఇన్వెస్టర్లు ప్యానిక్ అయ్యారు. వచ్చినంత చాలులే.. అనే ధోరణితో వరుసగా అదానీ కంపెనీల షేర్లను అమ్మేశారు. దీంతో వాటి విలువ గరిష్ఠ స్థాయుల నుంచి చూస్తే 60-80 శాతం వరకు పడిపోయింది. ప్రస్తుతం 57 శాతం నష్టం వద్ద ఆయా కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి.

వరుస అమ్మకాలతో 10 గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.19.2 లక్షల కోట్ల నుంచి రూ.8.2 లక్షల కోట్లకు తగ్గిపోయింది. అదానీ గ్రూప్ కంపెనీలు నష్టపోయిన మార్కెట్ విలువ 132 బిలియన్ డాలర్లు. ఇది మన దేశ జీడీపీలో 4.16 శాతానికి సమానం. అంగోలా దేశ వార్షిక జీడీపీకి సమానం. అదానీ గ్రూప్ పరిధిలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్ మార్, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఎన్డీటీవీ ఉన్నాయి.

More Telugu News