Narendra Modi: ప్రధాని మోదీ ర్యాలీకి అనుమతి ఇవ్వని మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం

Meghalaya govt denied permission for PM Modi rally
  • మేఘాలయలోని తురాలో ఈనెల 24న మోదీ ర్యాలీ
  • పీఏ సంగ్మా స్టేడియంలో ర్యాలీకి అనుమతి నిరాకరించిన మేఘాలయ క్రీడా శాఖ
  • మోదీ హవాను చూసి భయపడే ఇలా చేస్తున్నారని బీజేపీ ఆరోపణ
మేఘాలయలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ర్యాలీకి లో ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నెల 24వ తేదీన షిల్లాంగ్, తురాలో ప్రధాని మోదీఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్పీపీ అధినేత, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సొంత నియోజక వర్గమైన సౌత్ తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీని నిర్వహించేందుకు బీజేపీ అనుమతి కోరింది. కానీ, మేఘాలయ క్రీడా విభాగం అనుమతి నిరాకరించింది. స్టేడియంలో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెబుతూ బీజేపీ దరఖాస్తును తిరస్కరించింది. అయితే, రూ. 127 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియాన్ని గతేడాది డిసెంబర్ 16న ముఖ్యమంత్రి కాన్రాడ్ ప్రారంభించారు. 

స్టేడియం ప్రారంభోత్సవం జరిగిన రెండు నెలల తర్వాత ప్రధానమంత్రి ర్యాలీకి స్టేడియం అసంపూర్తిగా ఉందని, అందుబాటులో లేదని ఎలా చెబుతారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కావాలనే ప్రధాని మోదీ ర్యాలీ, సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మేఘాలయలో మోదీ హవా చూసి అక్కడి ప్రభుత్వం భయపడుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ర్యాలీలకు ప్రజల స్పందన చూసి ఇతర పార్టీలు అవాక్కయ్యాయని సిన్హా ఆరోపించారు. కాగా, 60 స్థానాలతో కూడిన మేఘాలయ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితం వెల్లడిస్తారు.
Narendra Modi
meghalaya
election rally
bjp
permission
denied

More Telugu News