Badrinath: బద్రీనాథ్ ప్రధాన రహదారిపై పగుళ్లు.. స్థానికుల్లో కలకలం

  • మొత్తం పదిచోట్ల గుర్తించిన స్థానికులు
  • చార్ ధామ్ యాత్ర ప్రకటించిన మరుసటి రోజే ఘటన
  • జోషిమఠ్ లో కుంగుబాటు నేపథ్యంలో భయాందోళన
Fresh cracks on Badrinath Highway hours after Uttarakhand announces Char Dham Yatra

ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ లో భూమి కుంగి ఇళ్ల గోడలకు పగుళ్లు రావడం తెలిసిందే. ఈ పగుళ్ల నేపథ్యంలో పలు నిర్మాణాలను అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కూల్చేశారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రోజులు, వారాలు గడిచినా ఇప్పటికీ జోషిమఠ్ వాసుల్లో ఆందోళన తగ్గడంలేదు. తాజాగా బద్రీనాథ్ రహదారిపైనా పగుళ్లు రావడంతో మరోసారి కలకలం రేగింది.

జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ వెళ్లే రహదారిపై పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. హైవేపై గతంలో ఏర్పడ్డ పగుళ్లు పెద్దగా మారుతుండగా.. కొత్తగా పలుచోట్ల పగుళ్లు ఏర్పడుతున్నాయని చెప్పారు. చార్ ధామ్ యాత్రను ఏప్రిల్ లో ప్రారంభించనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఆ మరుసటి రోజే బద్రీనాథ్ హైవేపై పగుళ్లు ఏర్పడడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

చార్ ధామ్ యాత్రలో ఈ రహదారి చాలా కీలకమని, బద్రీనాథ్ వెళ్లే భక్తులు ఇదే మార్గంలో ప్రయాణిస్తారని జోషిమఠ్ స్థానికులు చెప్పారు. ప్రస్తుతం ట్రాఫిక్ పెద్దగా లేదని, ఇప్పుడే పగుళ్లు వస్తుంటే చార్ ధామ్ యాత్ర రద్దీ పెరిగితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ పగుళ్లపై అధికార యంత్రాంగం స్పందించింది. జోషిమఠ్ కుంగుబాటుకు తాజాగా రహదారిపై ఏర్పడిన పగుళ్లకు సంబంధంలేదని తేల్చిచెప్పాయి. హైవేపై మొత్తం పదిచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని, అవి ప్రమాదకరం కాదని అధికారులు వివరించారు. 


More Telugu News