Turkey: 12 రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు.. టర్కీ భూకంపంలో మృత్యుంజయుడు

  • హతాయ్ లో 45 ఏళ్ల వ్యక్తిని కాపాడిన రెస్క్యూ టీమ్
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • ఇప్పటికీ 200 చోట్ల రెస్క్యూ పనులు కొనసాగిస్తున్నట్లు వెల్లడి
Turkey Finds New Survivor 278 Hours After Massive Quake

టర్కీ (తుర్కియా), సిరియాలను భూకంపం అతలాకుతలం చేసి 12 రోజులు గడిచిపోయాయి.. పేకమేడల్లా కూలిపోయిన భవనాల కింద ఇప్పటికీ కొంతమంది చిక్కుకుపోయారు. బయటపడే దారిలేక, తిండి, నీరు లేక నిస్సహాయ స్థితిలో ప్రాణాలు వదిలేస్తున్నారు.

టర్కీలోని హతాయ్ ప్రావిన్స్ లో మాత్రం రెస్క్యూ బృందాలు ఓ వ్యక్తిని శుక్రవారం సజీవంగా బయటకు తీశాయి. పన్నెండు రోజుల పాటు తిండి, నీరు లేకుండా, గడ్డకట్టించే చలిలో సాయం కోసం ఎదురుచూసిన వ్యక్తిని ఎట్టకేలకు కాపాడారు. దాదాపు 278 గంటల పాటు శిథిలాల కిందే ఉండిపోయిన ఆ వ్యక్తిని హుటాహుటిన ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

థర్మల్ జాకెట్ లో చుట్టి, స్ట్రెచర్ పై పడుకోబెట్టి రెస్క్యూ సిబ్బంది అతడిని బయటకు తీసుకొస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్ని రోజుల పాటు శిథిలాల కింద ప్రాణాలతో ఉండడం మిరాకిల్ అని అధికారులు చెబుతున్నారు. గురువారం కూడా ఓ పద్నాలుగేళ్ల యువకుడిని కాపాడినట్లు చెప్పారు.

హతాయ్ రీజియన్ లోని 200 ప్రాంతాల్లో రెస్క్యూ పనులు ఇంకా కొనసాగుతున్నాయని టర్కీ ఉపాధ్యక్షుడు ఫౌత్ ఒక్టే శుక్రవారం వెల్లడించారు. రాత్రీపగలు అన్న తేడా లేకుండా శిథిలాల తొలగింపు చేపడుతున్నట్లు వివరించారు. కాగా, భూకంపం కారణంగా టర్కీ, సిరియాలలో మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటిందని అధికారులు తెలిపారు.

More Telugu News