Pawan Kalyan: చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan reacts to police obstruction of Chandrababu
  • తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • బలభద్రపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ నిలిపివేత
  • రోడ్డుపై బైఠాయించిన పోలీసులు
  • పోలీసులపై పాలకుల ఒత్తిడి ఉందన్న జనసేనాని
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. బలభద్రపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ ఎదురుగా పోలీసులు రోడ్డుపై అడ్డంగా కూర్చోవడం పట్ల పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీసులే ఇలా రోడ్డుపై బైఠాయించడాన్ని వైసీపీ పాలనలోనే చూస్తున్నామని విమర్శించారు. 

చంద్రబాబు ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి అని, ఓ పార్టీ అధినేతగా పర్యటనకు వెళ్లే హక్కు ఆయనకు ఉందని, ఆయనను ఎలా అడ్డుకుంటారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 

"సాధారణంగా ప్రజలు నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయిస్తుంటారు. కానీ విధి నిర్వహణలో ఉన్న పోలీసులే రోడ్డుపై బైఠాయించాల్సి వచ్చిందంటే వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 

నేను గతంలో జనవాణి కార్యక్రమం కోసం విశాఖ వెళితే లైట్లు ఆపేశారు. హోటల్ లోనే నిర్బంధం చేశారు. ఇప్పటంలోనూ అడ్డుకున్నారు. కూల్చివేత బాధితులను పరామర్శించేందుకు వెళితే నడవకూడదని ఆంక్షలు విధించారు. విపక్షం గొంతుక వినిపిస్తే ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకు?" అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 

ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏమాత్రం గౌరవం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని, భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం వంటి పదాలకు ఈ ప్రభుత్వానికి అర్థం తెలుసా? అని నిలదీశారు. చంద్రబాబును అడ్డుకున్న తీరు నియంతృత్వ ధోరణులకు నిదర్శనం అని విమర్శించారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన చేశారు.
Pawan Kalyan
Chandrababu
Police
Janasena
TDP
Andhra Pradesh

More Telugu News