Air India: విమాన పైలట్లకు గోల్డెన్ డేస్.. ఎయిర్ ఇండియాలో భారీ నియామకాలు!

  • 470 విమానాలను కొనుగోలు చేస్తున్న ఎయిర్ ఇండియా
  • బోయింగ్, ఎయిర్ బస్ సంస్థలకు ఆర్డర్
  • వీటిని నడిపేందుకు 6,500 మంది పైలట్ల అవసరం
Air India will require more than 6500 pilots for 470 planes

విమాన పైలట్లకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. కరోనాతో విమాన సర్వీసులు నిలిచిపోయిన వేళ ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన పైలట్లు కూడా ఉన్నారు. కానీ, ఇదంతా గతం. విమానయాన సేవలు పూర్తి స్థాయిలో నడుస్తుండడంతో గతంలో తొలగించిన వారిని మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. అయితే, సమీప భవిష్యత్తులో భారత విమానయాన రంగం మరింత వృద్ధిని చూడనుంది. 


దేశంలో విమాన సేవల నెట్ వర్క్ విస్తరణకు కేంద్ర సర్కారు ఎంతో మద్దతునిస్తోంది. విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తోంది. దీంతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ క్రమంలో నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థను కేంద్ర సర్కారు టాటాలకు విక్రయించింది. ఎయిర్ ఇండియా జాతీయం కాక ముందు (కేంద్రం తీసకోవడానికి) దాన్ని టాటాలే నడిపించారు. తాము ఆరంభించిన సంస్థ తిరిగి తమ చేతికే రావడంతో ఎయిర్ ఇండియా సేవలను భారీగా విస్తరించే ప్రణాళికలను టాటా గ్రూప్ అమలు చేయనుంది.

ఇందులో భాగంగా 470 విమానాలు కావాలంటూ బోయింగ్, ఎయిర్ బస్ సంస్థలకు ఆర్డర్ ఇచ్చింది. అంతేకాదు అవసరమైతే మరో 370 విమానాలు కూడా కొనుగోలు చేస్తామంటూ ఆప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా నిర్వహణలో 113 విమానాలే ఉన్నాయి. 1,600 మంది పైలట్లు పనిచేస్తున్నారు. ఈ ప్రకారం చూస్తే కొత్తగా కొనుగోలు చేస్తున్న విమానాలను నడిపేందుకు అదనంగా 6,500 మంది పైలట్లు అవసరపడతారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు ఇన్ని విమాన సర్వీసులు పెరగడం వల్ల, అంతే మేర ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ సిబ్బంది, గ్రౌండ్ నిర్వహణ సిబ్బంది కూడా కావాల్సి వస్తుంది. టాటాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిరేషియా, విస్తారా సంస్థలను కూడా కలిపి చూస్తే మొత్తం 220 విమానాలు, 3,000 మంది పైలట్లు పనిచేస్తున్నారు.

More Telugu News