multiplex screens: మూవీ కోసం మల్టీప్లెక్స్ కు వెళుతున్నారా.. వెంట ‘శారిడాన్’ తీసుకెళ్లాలేమో చూడండి!

  • పెచ్చుమీరుతున్న యాజమాన్యాల వాణిజ్య ధోరణి
  • సినిమాకి ముందు 20 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు
  • మధ్యలో ఇంటర్వెల్ సమయంలో మరో 20 నిమిషాలు ప్రకటనలే
  • విసుగెత్తిపోతున్న వీక్షకులు
multiplex screens harassing visitors by throwing commercial adds and higher charges

నగరాలు, పట్టణాల్లో ఆధునిక సినిమా హాళ్ల (మల్టీప్లెక్స్)లో వాణిజ్య ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. ఆవరణలోకి అడుగుపెట్టనంత వరకే.. ఒక్కసారి మల్టీప్లెక్స్ గేటులోకి చొరబడ్డామా.. ఇక వినియోగదారుడు తన హక్కుల గురించి మర్చిపోవాల్సిందే. పార్కింగ్ దగ్గర మొదలై.. తినేది, తాగేది, చూసే వరకు చార్జీలపై థియేటర్ల నియంత్రణే రాజ్యమేలుతుంటుంది. ఇష్టం లేకపోతే నోరు మూసుకుని సినిమా చూసి వెళ్లిపోవాల్సిందే కానీ.. గట్టిగా నిలదీస్తే బీపీ పెరగడమే తప్పించి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. 


తమ ఆవరణలో ఆహారం, పానీయాల విక్రయాలకు సంబంధించి నియమ, నిబంధనలు విధించుకునే స్వేచ్ఛ సినిమా హాళ్లకు ఉంటుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం 2023 జనవరి 3న ఓ కేసులో భాగంగా తీర్పు చెప్పింది. వీక్షకులు తమ వెంట ఎలాంటి ఆహారం, పానీయాలు తెచ్చుకోకుండా థియేటర్లు అమలు చేస్తున్న విధానాన్ని సమర్థించింది. థియేటర్లు అన్నవి ప్రైవేటు కేంద్రాలని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. కానీ, తినుబండారాలను అసాధారణ రేట్లకు విక్రయించుకునే స్వేచ్ఛ వారికి ఇవ్వడం ఎంత వరకు సబబు? అనే ప్రశ్న ఇప్పటికీ సగటు సినిమా అభిమాని నుంచి వస్తూనే ఉంది. 

థియేటర్లలో విక్రయించే ఫుడ్, డ్రింక్స్ చార్జీలను అధిక ధరలకు విక్రయించడం ఎందుకు? అంటే తమ నిర్వహణ వ్యయాలు ఎక్కువగా ఉంటాయని నిర్వాహకులు చెబుతుంటారు. పోనీ టికెట్ చార్జీలు తక్కువ ఉన్నాయా? అంటే కానే కాదు. మల్టీ ప్లెక్స్ థియేటర్లలో రూ.200 నుంచి రూ.325 వరకు టికెట్ చార్జీ వసూలు చేస్తున్నప్పటికీ.. తమ ఖర్చులన్నీ రావడం లేదని అవి వాదించడం విడ్డూరంగా ఉంది. ఈ సాకు పేరుతో ఆహారం, పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. బయట రూ.20కు లభించే పాప్ కార్న్ మల్టీప్లెకస్ లోపల రూ.350-450కి విక్రయించడం ఎంత వరకు న్యాయమో వాటికే తెలియాలి. ఒక కోక్ డ్రింక్ రూ.280, ఒక కాఫీ రూ.170 చొప్పున అవి బాదుతున్నాయి. 

మంచి సినిమా చూసి కాస్తంత ఊరట చెందుదామని వచ్చిన ప్రేక్షకుడికి ఈ చార్జీల భారం ఒకవైపు మనోవేదన కలిగిస్తుంటే, ఇప్పుడు మరో వైపు వాణిజ్య ప్రకటనల రూపంలో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తున్నాయి థియేటర్లు. మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మరో కొత్త విపరీత ధోరణి వచ్చి పడింది. గతంలో సినిమా ఆరంభానికి ముందు ఓ రెండు నుంచి ఐదు నిమిషాలు మాత్రమే ప్రకటనలు వచ్చేవి. కానీ, ఇప్పుడు అలా కాదు. సినిమా ఆరంభానికి ముందు 20 నిమిషాలు, మధ్యలో విరామం తర్వాత 20 నిమిషాల చొప్పున ప్రకటనలు ప్రదర్శిస్తున్నాయి. నిర్బంధంగా ప్రేక్షకులతో ప్రకటనలు చూసేలా చేస్తున్నాయి. దీంతో 2-2.30 గంటల సినిమా కోసం ప్రేక్షకులు 3-3.30 గంటల సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఈ ధోరణికి చెక్ పెట్టాలన్నది సగటు ప్రేక్షకుల డిమాండ్ గా ఉంది. 

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత థియేటర్లు మూతపడ్డాయి. దాంతో వినోదం కోసం ప్రేక్షకులు ఓటీటీ యాప్స్ ను ఆదరించడం మొదలు పెట్టారు. కొత్త సినిమాలు సైతం నేరుగా ఓటీటీ యాప్స్ (అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా, నెట్ ఫ్లిక్స్ తదితర)లో విడుదల అయ్యాయి. ఒక్క సినిమా కోసం మల్టీప్లెక్స్ లో చేసే ఖర్చుతో నెల నుంచి మూడు నెలల పాటు ఓటీటీలో కావాల్సిన సినిమాలను ఇంటిల్లి పాదీ చూసుకునే వినోదం చౌకగా ప్రేక్షకుడికి అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. పూర్వపు స్థాయిలో ప్రేక్షకుల సంఖ్య ఇప్పుడు కనిపించడం లేదు. గతంతో పోలిస్తే కొంత తగ్గింది. అయితే కరోనా ముందు నాటితో పోలిస్తే వాణిజ్య ప్రకటనల ఆదాయం 32 శాతం తగ్గినట్టు పీవీఆర్ చెబుతోంది. తిరిగి ఆదాయాన్ని పెంచుకునేందుకు, ప్రకటనదారులను ఆకర్షించేందుకు ప్రేక్షకులతో అవే ప్రకటనలు మళ్లీ మళ్లీ చూపించడం దారుణంగా ఉంది.

ఇప్పుడు థియేటర్ల యాజమాన్యాల వాణిజ్య ధోరణులు ఇదే మాదిరి శ్రుతిమించి కొనసాగితే.. ప్రేక్షకులకు ప్రత్యామ్నాయం మినహా మరో మార్గం ఉండదని అవి అర్థం చేసుకుంటే మంచిదేమో. థియేటర్ల ఆవరణల్లో విక్రయించే వాటి ధరలను నిర్ణయించే అధికారం వాటి యాజమాన్యాలకు ఉండొచ్చు గాక.. చెప్పినంత చెల్లించి వినోదం కోసం వచ్చిన ప్రేక్షకులతో బలవంతంగా వాణిజ్య ప్రకటనలు చూపించడం వారి హక్కులను కాలరాయడం కాదా? ఇది న్యాయస్థానాలకు అర్థం కాదా? అన్నది సగటు సినీ అభిమాని ఆవేదన.

More Telugu News