Google: భారత్ లో 450 మంది ఉద్యోగులకు గూగుల్ గుడ్ బై!

Google begins layoffs in India more than 400 employees likely impacted
  • టెర్మినేషన్ లేఖలు అందుకుంటున్న ఉద్యోగులు
  • సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని పంచుకుంటున్న బాధితులు
  • ప్రపంచవ్యాప్తంగా 12వేల మందిని తప్పిస్తున్న గూగుల్
గూగుల్ ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు లోగడే ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి దశలో ఉద్యోగుల తొలగింపు మొదలైంది. భారత్ లోని గూగుల్ ఉద్యోగులు ఉద్వాసన లేఖలను అందుకున్నారు. భారత్ కార్యాలయాల నుంచి సుమారు 450 మందిని తొలగించినట్టు తెలుస్తోంది. గూగుల్ కు హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ లో కార్యాలయాలు ఉన్నాయి.

గూగుల్ నుంచి బయటకు వచ్చేశామంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తున్నారు. ‘‘గూగుల్ ఇండియా ఇటీవలి తొలగింపుల్లో ఎంతో నైపుణ్యాలు, ప్రతిభ ఉన్న సహోద్యోగులు కొందరు ప్రభావితమైనట్టు ఈ రోజు ఉదయమే సమాచారం అందింది’’ అంటూ గూగుల్ ఇండియా ఉద్యోగి రజనీష్ కుమార్ షేర్ చేశారు. గూగుల్ ఇండియా నిన్న తొలగించిన వారిలో తాను కూడా ఉన్నానని అకౌంట్ మేనేజర్ కమల్ దవే సైతం తెలిపారు. 

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో ఉద్యోగులను అధికంగా పనుల్లోకి తీసుకోవాల్సి వచ్చిందని, అందుకే ఇప్పుడు కొందరిని తొలగిస్తున్నట్టు గూగుల్ వివరణ ఇచ్చింది. దీనికితోడు బలహీన స్థూల ఆర్థిక పరిస్థితులతో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు పేర్కొంది. గూగుల్ తో పాటు ఎన్నో దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు సైతం ఉద్యోగుల తొలగింపుపై నిర్ణయాలు ప్రకటించడం తెలిసిందే.
Google
layoffs
India
employees
450
affected

More Telugu News