Cheteshwar Pujara: టెస్ట్ చాంపియన్ షిప్ గెలవడమే నా కల.. తన 100వ టెస్టుకు ముందు పుజారా వ్యాఖ్యలు

  • టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రేపు రెండో టెస్ట్
  • ఈ మ్యాచ్ తో 100 మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్ల జాబితాలోకి పుజారా
  • తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉందన్న వెటరన్ బ్యాటర్
Dream is to win WTC Final for India says Cheteshwar Pujara

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా అరుదైన మైలు రాయిని అందుకోనున్నాడు. 100 మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చేరనున్నాడు. రేపు జరిగే రెండో టెస్టుతో ఈ ఘనత అందుకోనున్నాడు.

ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన పుజారా.. తాను దేశం తరఫున 100 టెస్టులు ఆడుతానని ఎన్నడూ అనుకోలేదని చెప్పాడు. తన డ్రీమ్ గురించి రిపోర్టర్లు అడగ్గా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియా గెలవాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. 

‘‘100 టెస్టులు ఆడటమంటే.. నాకు, నా కుటుంబానికి ఎంతో గొప్ప విషయం. ఇందులో మా నాన్న చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన రేపు మ్యాచ్ చూసేందుకు వస్తారు. ఎంతో మద్దతుగా నిలిచిన కుటుంబానికి నేను రుణపడి ఉంటాను. నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది’’ అని వివరించాడు. 

బోర్డర్ - గవాస్కర్ టెస్టు సిరీస్ ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. తొలిమ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. రేపటి నుంచి జరిగే రెండో టెస్టు కోసం ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది. 
 
మరోవైపు టీమిండియా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆడేందుకు రెండు అడుగుల దూరంలోనే ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో రెండు టెస్టులు గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. డబ్ల్యూటీసీ చరిత్రలో వరుసగా రెండు సార్లు ఫైనల్ ఆడిన జట్టుగా నిలుస్తుంది.

More Telugu News