Bengaluru: ఈ నగరాల్లో ట్రాఫిక్ నరకం.. లిస్టులో బెంగళూరు!

  • ప్రపంచంలోనే ‘అతి నెమ్మది’ నగరాల జాబితాను ప్రకటించిన టామ్ టామ్ సంస్థ
  • టాప్ లో లండన్.. ఇక్కడ వాహనంలో పది కిలోమీటర్లు ప్రయాణించేందుకు 36.20 నిమిషాల సమయం
  • రెండో స్థానంలో బెంగళూరు.. ట్రాఫిక్ లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి 29.10 నిమిషాలు
Bengaluru worlds second slowest city to drive in

వాహనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ.. ట్రాఫిక్ తిప్పలు ఎక్కువవుతున్నాయి. కొద్ది దూరం వెళ్లేందుకు కూడా గంటలపాటు ట్రాఫిక్ లో గడపాల్సిన పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ఇక నరకమే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ పై డచ్‌ మల్టీ నేషనల్‌ డెవలపర్‌ ‘టామ్‌ టామ్‌’ సర్వే చేసింది. ట్రాఫిక్ లో ప్రతి 10 కిలోమీటర్ల ప్రయాణానికి పట్టే సమయం అధారంగా.. ప్రపంచంలోనే ‘అతి నెమ్మది’ నగరాల జాబితాను సిద్ధం చేసింది.

టాప్ 10 ర్యాంకుల్లో మన దేశంలోని రెండు నగరాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి నెమ్మది (స్లోయెస్ట్‌ సిటీ) నగరంగా బ్రిటన్ లోని లండన్ నిలిచింది. ఇక్కడ వాహనదారులకు ప్రతి పది కిలోమీటర్లు ప్రయాణించేందుకు 36.20 నిమిషాలు పడుతోంది.

రెండో స్థానంలో కర్ణాటక రాజధాని బెంగళూరు నిలిచింది. బెంగళూరు ట్రాఫిక్ లో వాహనంపై ప్రతి పది కిలోమీటర్లు ప్రయాణించేందుకు 29.10 నిమిషాలు పడుతున్నట్టు టామ్‌ టామ్‌ సర్వేలో వెల్లడైంది. 

2022లో ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల్లోని 389 నగరాలపై టామ్‌ టామ్‌ కంపెనీ సర్వే చేసింది. టాప్ 10లో వరుసగా లండన్, బెంగళూరు తర్వాత డబ్లిన్ (ఐర్లాండ్), సప్పోరో (జపాన్), మిలన్ (ఇటలీ), పూణె (ఇండియా), బుచారెస్ట్ (రొమానియా), లిమా (పెరు), మనీలా (ఫిలిప్పీన్స్), బగోటా (కొలంబియా) ఉన్నాయి. ఇక ఢిల్లీ 34వ స్థానంలో, ముంబై 47వ స్థానంలో నిలిచాయి. 

ఇక కర్బన ఉద్గారాల విడుదల విషయంలో బెంగళూరు ఐదో స్థానంలో నిలిచింది. ఈ నగరంలో పెట్రోల్‌ కార్ల నుంచి ఏడాదికి సగటున ప్రతి ఆరు మైళ్లకు 974 కిలోల కర్బన ఉద్గారాలు వెలువడుతున్నట్టు సర్వేలో తేలింది.

More Telugu News